పాస్ పోర్ట్ ఇండెక్స్ లో సింగపూర్ టాప్.

న్యూఢిల్లీ:

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఏది? అగ్రరాజ్యం అమెరికా కాదు.. అభివృద్ధి చెందిన దేశాలుగా పేరొందిన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు కానే కాదు. దక్షిణాసియా దేశం సింగపూర్ దే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్. ఏటా ప్రకటించే వార్షిక పాస్ పోర్ట్ ఇండెక్స్ లో 165 దేశాలకు వెళ్లగలిగే పాస్ పోర్ట్ తో సింగపూర్ అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జర్మనీ, డెన్మార్క్, స్వీడన్ ఉన్నాయి. భారత పాస్ పోర్ట్ ప్రపంచంలో 66వ స్థానంలో ఉంది. వీసా ఫ్రీ స్కోర్ ఆధారంగా పాస్ పోర్ట్ ర్యాంకింగ్ నిర్ణయించడం జరుగుతుంది. అంటే వీసా లేకుండా లేదా చేరిన తర్వాత వీసా పొందడం, విజిటర్స్ పర్మిట్, చేరిన తర్వాత ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ పొందే వీలును నిర్థారిస్తారు. దీని ప్రకారం భారత పాస్ పోర్ట్ తో 66 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. గత ఏడాదితో పోలిస్తే భారత్ 9 స్థానాలు మెరుగైంది. ఇక ఈ జాబితాలో చిట్టచివరన 91వ ర్యాంకు ఆఫ్గనిస్థాన్ కు దక్కింది. ఆఫ్గనిస్థాన్ స్కోరు 22 మాత్రమే. దానికి ముందు 90వ ర్యాంకులో పాకిస్థాన్, ఇరాక్ ఉన్నాయి. వాటి స్కోరు 26. సిరియా 88, సొమాలియా 87 స్థానాల్లో నిలిచాయి.