ఆ ఇద్దరినీ సుప్రీంకోర్ట్ జడ్జిలుగా నియమించొద్దు!!

ఆ ఇద్దరినీ సుప్రీంకోర్ట్ జడ్జిలుగా నియమించొద్దు!!

Supreme court Judges issue

ప్రకాశ్, న్యూఢిల్లీ:

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దినేష్ మహేశ్వరీలను సుప్రీంకోర్ట్ జడ్జిలుగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుపై వివాదం మొదలైంది. ఢిల్లీ హైకోర్ట్ మాజీ జడ్జి, సీనియర్ న్యాయవాది కైలాష్ గంభీర్ కొలీజియం సిఫార్సుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాశారు. జస్టిస్ గంభీర్ తన లేఖలో సీనియారిటీని పక్కన పెట్టిన అంశాన్ని లేవనెత్తారు. కొలీజియం సిఫార్సుతో న్యాయవ్యవస్థ మొత్తానికే పెద్ద షాక్ తగిలినట్టయిందని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, విశ్వసనీయతను సంరక్షించాలని కైలాష్ గంభీర్ రాష్ట్రపతిని కోరారు. మరోసారి చారిత్రక తప్పిదం జరగకుండా అడ్డుకోవాలని అభ్యర్థించారు.జస్టిస్ ఖన్నా పేరు సిఫార్సుతో ఢిల్లీ హైకోర్ట్ కే చెందిన ముగ్గురు సీనియర్ జడ్జిలను పక్కన పెట్టినట్టయిందని జస్టిస్ గంభీర్ ఆరోపించారు. ఆలిండియా సీనియారిటీలో అయితే 32 మందికి పైగా సీనియర్ జడ్జిలను ఉపేక్షించడం జరిగిందన్నారు. జస్టిస్ ఖన్నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సుప్రీంకోర్ట్ జడ్జిగా ఆయన పేరు సిఫార్సుతో 32 సీనియర్ న్యాయమూర్తులను పక్కన పెట్టారని జస్టిస్ గంభీర్ తెలిపారు. వీరిలో ఢిల్లీ హైకోర్ట్ కే చెందిన చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. దీంతో కొలీజియంలోని సభ్యుల బుద్ధి, యోగ్యతలపై సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు.
ఈ లేఖలో జస్టిస్ సంజీవ్ ఖన్నా పెదనాన్న అయిన జస్టిస్ ఎస్ఆర్ ఖన్నా ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి అని చెప్పారు. సమ్మతం కాని తీర్పు ఇచ్చిన కారణంగా ఆయన సీనియారిటీని గుర్తించలేదని, జస్టిస్ ఎస్ఆర్ ఖన్నాను సీజేఐగా నియమించలేదని జస్టిస్ గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటే జూనియర్లను సీజేఐగా నియమించిన కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. చివరగా జస్టిస్ గంభీర్ ‘మరో చీకటి దినం’, ‘మరో చారిత్రక తప్పిదం’ జరగకుండా ఆపాలని రాష్ట్రపతిని కోరారు.గత ఏడాది జనవరిలో జరిగిన జడ్జిల ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి కూడా జస్టిస్ గంభీర్ తన లేఖలో ప్రస్తావించారు. ఆ సమావేశంలో ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఉన్నారని గుర్తు చేశారు. వ్యవస్థ సురక్షితంగా లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం మనలేదని ఆయన మీడియాతో చెప్పారని జస్టిస్ గంభీర్ ఉటంకించారు.