మతాలు వేరైనా ‘పేగు బంధానికి’ ఆస్తిపై హక్కు ఉంంది!!

మతాలు వేరైనా ‘పేగు బంధానికి’
ఆస్తిపై హక్కు ఉంంది!!

ప్రశాంత్, న్యూఢిల్లీ:

ముస్లిం పురుషుడికి హిందూ భార్య ద్వారా కలిగిన బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా అడిగే హక్కు ఉంటుందని సుప్రీంకోర్ట్ ప్రకటించింది. విగ్రహారాధన జరిపే లేదా అగ్నిని ఆరాధించే మహిళతో ముస్లిం పురుషుడి వివాహం ప్రామాణికమైనది కాదు, తప్పుడుది కాదు కానీ అది ఒక అసంపూర్ణమైన పెళ్లి మాత్రమేనని జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ మోహన్ ఎం శంతనగౌడర్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. మొహమ్మద్ ఇలియాస్, వల్లియమ్మల కొడుకు చట్టప్రకారం తనకు తండ్రి ఆస్తిలో వాటా ఇప్పించాలని కోరుతూ వేసిన పిటిషన్ పై కేరళ హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ ను ధర్మాసనం విచారణకు చేపట్టింది. వల్లియమ్మ హిందువైనందువల్ల ఆమెకు మొహమ్మద్ ఇలియాస్ ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదని, అలాగే ఆమె కుమారుడికి మొహమ్మద్ ఇలియాస్ ఆస్తిలో ఎలాంటి వాటా ఇవ్వనక్కర్లేదని ప్రతివాదుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ గురు కృష్ణకుమార్ వాదించారు. మొహమ్మడన్ చట్టంలోని ముల్లా నియమాలు, సయ్యద్ అమీర్ అలీ నియమాలలో పేర్కొన్న విషయాలను ఉటంకిస్తూ ధర్మాసనం ముస్లిం చట్టం ప్రామాణికమైన వివాహం, తప్పుడు వివాహం, అసంపూర్ణమైన వివాహం గురించి స్పష్టంగా వివరణ ఉందని పేర్కొంది. అందువల్ల ప్రామాణికమైన పెళ్లి, అసంపూర్ణమైన వివాహం ఒకటేననడం సరికాదని తెలిపింది. ప్రస్తుత కేసులో దంపతులకు అసంపూర్ణ పెళ్లి ద్వారా కలిగిన కుమారుడు కలిగాడని, ఇది ముస్లిం చట్టప్రకారం చట్టవిరుద్ధమే అయినప్పటికీ తప్పుడు వివాహం కానందువల్ల అతనికి తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.