ఒంటి నిండా బంగారంతో రౌడిదర్జా

మదురైలో అతడో పేరుమోసిన రౌడి. అతడిపై రౌడీషీటేకాదు ఏకంగా 14 కేసులు ఉన్నాయి. హత్య, బెదిరింపులు, హత్యాయత్నం, దందా సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి పేరు వరిచియూర్ సెల్వం. మధురైలో అతడి పేరు చెబితే భయంతో జనం హడలిపోతారు. ఎంత పెద్ద రౌడి అయినప్పటికీ అతడికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి బంగారం, రెండోది దైవం. కేజీలకు కేజీల బంగారు నగలు వేసుకోవటమంటే సెల్వంకు పిచ్చి. అదే సమయంలో దేవుడంటే మహా భక్తి భయం కూడా.

ఒంటి నిండా బంగారంతో కాంచిపురంలోని అత్తివరదర్ ఆలయాన్ని దర్శించుకోవాలనే కోరిక అతడికి కలిగింది. అనుకున్నదే తడవుగా మదురై పోలీసు కమిషనర్ ద్వారా కాంచిపురం ఎస్పీకి సమాచారం పంపించి అత్తివరదర్ దర్శనానికి వచ్చాడు.అంతే మనోడికి పోలీసులు రాచమర్యాదలతో స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించి జాగ్రత్తగా పంపించివేశారు. ఒంటినిండా బంగారంతో ఓ రౌడి సకల మర్యాదలతో స్వామివారి దర్శనం చేసుకోవడంపై స్థానికులు వింతగా చర్చించుకుంటున్నారు. రౌడీనా మజాకా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.