ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.

ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.

null

– రమేశ్ హజారి:

అసెంబ్లీ సమావేశాలు ఆదివారానికి ముగిసినాయి. డిసెంబర్ 16 బుధవారం నాడు ప్రొటెం స్పీకర్ ఎన్నికతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల ప్రక్రియ ఐదు రోజుల పాటు సాగి డిసెంబర్ 20 ఆదివారం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెల్పిన తర్వాత నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల ప్రక్రియలో మొదటిరోజు గవర్నర్ ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకున్నారు. శుక్రవారం నాడు పూర్తిస్తాయి సభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డిని సభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. గవర్నర్ ప్రసంగంతో మూడోరోజయిన శనివారం సమావేశాలు ప్రారంభమైనాయి. తన ప్రభుత్వం గత టర్మ్ లో అందించిన పాలనను, తద్వారా సాధించిన విజయాలను పరిశీలించి తదనుగుణంగా ప్రజలు తిరిగి కెసిఆర్ ను రెండో దఫా ఎన్నుకున్నారని గవర్నర్ తన ప్రసగంలో విశ్లేషించారు. గతంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ది పథకాలను మరింత గుణాత్మకంగా కొనసాగిస్తూనే రాబోయే ఐదేండ్ల కాలంలో తన ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణను గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను సమావేశపరిచి తన ప్రసంగం ద్వారా ప్రకటించారు.గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని మాజీ చీప్ విప్ కొప్పులు ఈశ్వర్ ప్రవేశపెట్టగా దాన్ని సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగం మీద సభ్యుల విపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు శాసన సభలో సభానాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చినారు. పంచాయితీరాజ్ చట్టం ఆర్డినెన్స్ ప్రవేశానంతరం శాసన సభ నిరవధిక వాయిదా పడ్డది.శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రవేశపెట్టగా సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినారు. అనంతరం హోం మంత్రి అహ్మద్ మహమూదఅలి, సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలిచ్చినారు. గవర్నర్ ప్రసంగానికి సభ ఆమోదం తెలుపిన అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. అంతకు ముందు పంచాయితీ రాజ్ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ ను మండలిలో ప్రవేశపెట్టినారు.తెలంగాణ ఉద్యమసారథిగా గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమనేత కేసీయార్ ను 2014 లో తమ పాలన సారథిగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకుని ప్రభుత్వ బాధ్యతలను తెలంగాణ ప్రజలు అప్పగించినారని పల్లా తెలిపారు.నాలుగేండ్ల కేసీయార్ అభివృద్ధి సంక్షేమ పాలనను ఆమోదిస్తూ గొప్పపరిపాలనాధక్షునిగా గుర్తించి తిరిగి కేసీయార్ కు పట్టం కట్టిన్రు..అని తెలిపారు. వలసపాలన ముగింపు సమయానికి తెలంగాణలో విద్యుత్తు వ్యవసాయం కులవృత్తులు సహా సమస్త రంగాలు కునారిల్లిపోయిన గందరగోళ పరిస్తితులు కేసీయార్ కు ఆహ్వానం పలికినాయన్నారు. అటువంటి ప్రతిబంధకాల నడుమనుంచి ఆర్ధిక క్రమశిక్షణతో ప్రణాళికాబద్దమైన పాలనను ప్రారంభించి వొక్కో రంగాన్ని ప్రక్షాళన చేసి అవినీతి రహితంగా నాలుగేండ్ల అతి తక్కువ కాలంలనే దేశానికే ఆదర్శవంతమైన పాలనను సిఎం అందించినారని కొనియాడారు.
నలభై వేల కోట్ల రూపాయలను కేటాయించి దాదాపు 48 లక్షల మంది అర్హులైన వారికి రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.అనేక అడ్డంకులను ఎదుర్కొని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సిఎం కేసీయార్ తెలంగాణ విద్యుత్తు రంగంలో విప్లవాన్ని సాధించినారన్నారు. ఇప్పటికే విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటుకంటే ముందుండి తన అభివృద్ది కాంక్షను చైతన్యాన్ని చాటుతున్న తెలంగాణ, 28వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం లక్ష్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నార.
దాదాపు 45 వేల కోట్ల ఖర్చుతో లక్షా నలభై అయిదు వేల కిలోమీటర్ల పైపు లైను నిర్మాణాలతో దాదాపు 23వేల జనావాసాల్లోకి ఇంటింటికీ నల్లాద్వారా శుద్ది చేసిన స్వచ్చమైన ఉపరితల నదీ జలాలను త్రాగునీటిగా అందించే మహోన్నత చరిత్రసృష్టిస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని మార్చి 2019 నాటికి పూర్తిస్తాయిలో వినియోగం లోకి తేనున్నామని స్పష్టం చేశారు. 45 వేల చెరువులను పూడికతీసి పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రారంభించిన చారిత్రక మిషన్ కాకతీయ కార్యక్రమం తన లక్ష్యాన్ని దాదాపు గా చేరుకున్నదని తెలిపారు. ప్రజోపకరణాలైన కార్యక్రమాలన్నీ యుద్దప్రాతిపదికన (మిషన్ మోడ్లో) సిఎం పూర్తిచేయిస్తున్నారని పల్లా తెలిపారు.పాలనలో రోల్ మోడల్ గా ముఖ్యమంత్రి కేసీయార్ నిలిచారని, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి దేశానికే ఇవాల తెలంగాణ వొక మోడల్ గా నిలిపారని పల్లా తెలిపారు. తన మొదటి ప్రభుత్వంలో 17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, లక్షాయాభై వేల ఎకరాలకు, ఎకరానికి సాలీనా ఎనిమిదివేల రూపాయలు పంటపెట్టుబడిగా అందిస్తూ చారిత్రక రైతుబంధు ను అమలు పరుస్తున్నదని తెలిపారు. ఎటువంటి కారణం చేతనయినా సరే దురదృష్టవశాత్తూ, గుంట భూమి వున్న రైతైనా సరే, మరణిస్తే అతని కుటుంబానికి పదిరోజుల్లోపు 5 లక్షల రూపాయాల జీవిత బీమా సొమ్మును రైతు బీమా పథకం ద్వారా అందచేయడం గొప్ప విషయమన్నారు. వ్యసాయానికి అండగా నిలవడి, రైతు కుంటుంబాలకు పెద్దకొడుకుగా ప్రభుత్వం నిలిచిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు కేంద్రం కూడా అనుసరించదగ్గ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.ఇటువంటి గొప్ప కార్యాచరణనను వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించగా ప్రముఖ రచయిత అశోక్ గులాటి, అన్నా హజారే వంటి వారు కొనియాడారని తెలిపారు. ప్రజలను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిన పథకాలుగా యుఎన్వో రైతుబంధు రైతుబీమా పథకాలను గుర్తించిందన్నారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చి..రైతే రాజు అనే నానుడిని వాస్తవం చేయడానికి సిఎం కేసీయార్ కంకణబద్దుడయి వున్నారనడానికి ఈ రెండు పథకాలు ఉదాహరణలుగా నిలిచాయని తెలపినారు. రెసిడిన్సియల్ విద్యా సంస్థలు స్థాపించి విద్యారంగాన్ని, కెసిఆర్ కిట్స్ తదితర ఆరోగ్య పథకాలతో వైద్య రంగాన్ని, టిఎస్ ఐపాస్ వంటి పథకాలతో పారిశ్రామిక రంగాన్ని సిఎం కేసీయార్ గుణాత్మకంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.రాష్ట్రంలో శాంతి బధ్రతలు సజావుగా సాగుతున్నాయని, అన్ని వర్గాల ప్రజలు ప్రబుత్వంమీద భరోసాతో వుంటున్నారని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ సాగునీటి రంగంలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమీషన్ 12 మంది సభ్యుల బృందం స్వయంగా వచ్చి పరిశీలించి, అత్యద్భుత ప్రాజెక్టుగా కీర్తించడం అంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ యేమిటో విమర్శకులు సైతం అర్తం చేసుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి సహా ప్రారంభించిన ప్రాజెక్టులను త్వరిత గతిలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలనే మహోన్నత లక్ష్యంతో సిఎం కేసీయార్ ముందుకు సాగుతున్నరని స్పష్టం చేసినారు. సాగునీటి రంగాన్ని ఇరిగేషన్ ఇంజనీరుగా, విద్యుత్ రంగాన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరుగా, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను రూపొందించే క్రమంలో సోషల్ ఇంజనీర్ గా, సుస్థిర పాలనను అందిస్తూ పొలిటికల్ ఇంజనీర్ గా ముఖ్యమంత్రి కేసీయార్ తన మహోన్నత కర్తవ్యాన్నినిర్వహిస్తున్నారని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మానిఫెస్టోలలో చేర్చినవే కాకుండా చేర్చని పథకాలను ప్రవేశపెట్టి పూర్తిచేస్తూ, బంగారి తెలంగాణ సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని,ఆ దిశగా సాగిన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు తాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచాలని సభ్యులను పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరినారు. సభ సదరు తీర్మానాన్ని ఆమోదించింది.