ధాన్య సేకరణలో దేశంలో తెలంగాణకు రెండవ స్థానం

ధాన్య సేకరణలో దేశంలో
తెలంగాణకు రెండవ స్థానం.


Hyderabad:

ఈ ఏడాది 2018-19లో పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. రూ. 13,675 కోట్ల విలువ చేసే 77.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 14.73 లక్షల మంది రైతుల నుండి కొనుగోలు చేసింది. “తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదీ అత్యధికం. కనీస మద్దతు ధర (గ్రేడ్‌-ఎ క్వింటాల్‌కు రూ. 1770, సాధారణ రకం – క్వింటాల్‌కు రూ.1750)కు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాలోకి నేరుగా జమ చేసింది. ఖరీఫ్‌లో 8,09,885 మంది రైతుల నుండి 3297 కొనుగోలు కేంద్రాల ద్వారా 40.41 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 6,63,723 మంది రైతుల నుండి 3509 కొనుగోలు కేంద్రాల ద్వారా 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ తరువాత దేశంలోనే రెండవ స్థానంలో నిలించింది. ఖరీఫ్‌, యాసంగిలో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 6816 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 14,73,608 మంది రైతుల నుండి 77.41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది 2017-18లో 53.98 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 23.43 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికంగా కొనుగోలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌరసరఫరాల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిపాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే ఖచ్చితంగా మద్దతు ధర లభిస్తుందనే నమ్మకంతో రైతులు ఈ కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని వారి ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేసేలా ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.
కొత్త రాష్ట్రమైన తెలంగాణ కేవలం ఐదు సంవత్సరాల్లోనే ధాన్యం సేకరణలో దేశంలోనే పంజాబ్‌ తరువాత రెండవ స్థానానికి చేరుకుందని, ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని, ఈ ఘనత ముఖ్యమంత్రిదే”నని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పౌరసరఫరాల అధికారులు, జాయింట్‌ కలెక్టర్లు బాగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.”ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సబర్వాల్‌ అందరితో సమన్వయం చేసుకున్నారు. స్వయంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, రవాణా వంటి అంశాలను పరిశీలించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కావల్సిన నిధులను సమకూర్చడం వల్ల ఎలాంటి జ్యాపం లేకుండా రైతులకు చెల్లింపులు చేయడం జరిగింది. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తిచేయగలిగాం” అని మారెడ్డి చెప్పారు.