పోలీసుల అదుపులో ప్రొఫెసర్ సహా ముగ్గురు విద్యార్థులు!!

karimnagar:

శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో పాటు మరో ముగ్గురు టి.వి.వి.కి చెందిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అందింది. నాగ్ పూర్, పూణే జైళ్లలో వివిధ కేసుల్లో ఉన్న ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా, విప్లవ కవి వరవరరావులను విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ‘తెలంగాణ విద్యార్థి వేదిక’ ఆధ్వర్యంలో జిల్లాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, కరపత్రాల పంపిణీ వంటి కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుండడంతో పోలీసులు ఈ సంఘంపై దృష్టి పెట్టారు. ‘తెలంగాణ విద్యార్థి వేదిక’ను మావోయిస్టు పార్టీ ‘కవర్ ఆర్గనైజేషన్’ గా పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థినీ విద్యార్థుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నిషిద్ధ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదికలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఇది విద్యార్థి హక్కుల పోరాట వేదికని చెబుతూ అనేకమంది విద్యార్థినీ విద్యార్థులను ఈ సంస్థలో చేర్చుకుంటున్నారు.

ఈ ‘వేదిక’కు నాయకులుగా పనిచేస్తున్న కొరివి సూర్యుడు, కరికె మహేష్, దొగ్గల రాజు లతో పాటు మరికొంతమంది ఇటీవల చత్తీస్ ఘడ్ కు వెళ్లి మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు చంద్రన్నను కలిసి పెద్దఎత్తున నిధులను తీసుకువచ్చారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అని చెప్పకుండా శాతవాహన యూనివర్సిటీతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు విద్యా సంస్థలకు వెళ్లి సభ్యత్వాలను నమోదు చేస్తున్నట్టు చెబుతున్నారు. శాతవాహన యూనివర్సిటీ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సూరేపల్లి సుజాత స్టడీటూర్ల పేరిట విద్యార్థులను ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని మారుమూల ఆటవీప్రాంత గ్రామాలకు తీసుకవెళ్లి మావోయిస్టులతో సమావేశాలను ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.