”ఖర్చు నాది…..టికెట్ నీది”!! కాంగ్రెస్ నెత్తిన ‘కారు’ బాంబు!!

ఎస్.కే. జకీర్:

కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారులో టిఆర్ఎస్ కు ఏమి పని? అని ప్రశ్నించడం అమాయకత్వం కాగలదు. తిరిగి అధికారంలోకి రావాలంటే అధికారపక్షంగా ఏ పార్టీ ఉన్నా ‘మాయోపాయాలు’ చేస్తుంది.ఇది సహజం. టిఆర్ఎస్ కూడా అదే పనిలో మునిగి ఉన్నట్టు ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నది. ఈ ప్రచారంలో నిజమెంత ఉన్నదో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం స్పష్టత రావచ్చును . తమ అభ్యర్థుల బలాబలాలను బట్టి ప్రత్యర్థి శిబిరం నుంచి ‘బలహీనులను’, సమర్ధత లేని వ్యక్తులను రంగంలోకి తీసుకువచ్చేందుకు కేసీఆర్ శిబిరం ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ కు సమాచారం అందుతున్నది. దాదాపు 20 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ‘ఆశావహుల’కు ఇప్పటికే ‘గాలం’ వేసినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలలో ఒక ప్రచారం జరుగుతున్నది. టీఆరెస్ ‘వల’ కు చిక్కిన ‘ఆశావహుల’ వ్యవహారంపై రాహుల్ గాంధీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అప్రమత్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధికార పార్టీ జరుపుతున్న’ ప్రయత్నాలు’, తాజా వ్యూహాలు కాంగ్రెస్ ను నివ్వెర పరుస్తున్నవి. చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని కొత్త ‘రాజనీతి’ కి కేసీఆర్ తెర లేపినట్టు కాంగ్రెస్, టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అభ్యర్థుల ‘వడపోత’ కార్యక్రమంపై ప్రత్యేకంగా కొన్ని నివేదికలను రాహుల్ గాంధీ టీమ్ తెప్పించుకున్నట్టు తెలిసింది. కాంగ్రెసు పార్టీలో టీఆరెస్ ‘చొరబాటు దారులు’నేరుగా కనిపించకపోయినా, ఆ పార్టీ లోని వారినే ‘లోబరచుకునే’ ప్రయత్నాలు జరుగుతున్నట్టు,ఈ దిశగా కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ‘ఆశావహుల’ను టీఆరెస్ తమ వైపునకు తిప్పుకున్నట్టు ప్రచారం ఉన్నది. కాంగ్రెస్ నుంచి ‘గెలిచిన’ తర్వాత కూడా పార్టీ ‘ఫిరాయింపు’లు తప్పవని సమాచారం ఉన్నది. దాదాపు 20 అసెంబ్లీ స్థానాల్లో టీఆరెస్ మాజీ ఎమ్మెల్యేలు వేస్తున్న ‘ఎత్తులు’ కాంగ్రెస్ అధిష్టానం కనిపెట్టలేక పోతున్నట్టు తెలిసింది. కాంగ్రెసు పార్టీ తరపున ‘ఎవరు’పోటీ చేయాలో, సర్వేలలో ‘ఎవరిని’ ఎంపిక చేయాలో కాంగ్రెస్ ను ‘ప్రభావితం’ చేయడానికి టీఆరెస్ అభ్యర్థులే తీవ్రంగా కృషి చేసినట్టు తెలుస్తున్నది. ‘బలహీన’ ప్రత్యర్థులు, గట్టి పోటీ దారులు కానీ వారు బరిలో ఉంటే తమ విజయం మరింత సులువు అని కేసీఆర్ భావన అని తెలుస్తున్నది.కొందరు కాంగ్రెస్ ‘ఆశావహుల’ తో ప్రగతి భవన్ ప్రముఖులు ‘టచ్’ లో ఉన్నట్టు కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న నాయకుడొకరు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, జన సమితి నాయకులతోనూ టిఆర్ఎస్ కీలక వ్యక్తులు, కేసీఆర్ అనుకూల మనుషులు నిరంతరం మాట్లాడుతున్నట్టు కూడా ఆయన అన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ‘బీ ఫామ్’ తీసుకోవడానికి ముందు, బీ ఫామ్ తీసుకున్న తర్వాత…. మూడు, నాలుగు రకాలుగా విభజించి ‘ప్యాకేజీ’ లను ఆఫర్ చేస్తున్నట్లు కొందరు కాంగ్రెస్ ఆశావహుల ఆరోపణ. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ‘అవతలి పార్టీ’ నుంచి ‘బలహీనులే’ బెటర్ అనే అభిప్రాయాన్ని కల్పించడానికి గాను ఉత్తర తెలంగాణలోని ఒక జనరల్ సీటుకు చెందిన టీఆరెస్ అభ్యర్థి పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అధికార పార్టీ డబ్బును నీళ్ల లా ఖర్చుపెడుతున్నదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్తుల మొదటి జాబితా విడుదల కానున్నది. రెండో జాబితా నవంబరు 6 , 7 తేదీల్లో విడుదల కావచ్చు. మొత్తం అభ్యర్థుల జాబితా విడుదల అయితే తప్ప టీఆరెస్ ‘వల’ కు చిక్కుకున్న వారెవరో వెల్లడవుతుందని సమాచారం అందుతున్నది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వే వ్యవహారమూ ‘అనుమానాస్పదంగా’ ఉన్నట్టు కొందరు ఆశావహుల ఆరోపణ. టీఆరెస్ కోవర్టు లకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్టు ఇస్తే కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయమన్న అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.