అమెరికా రోడ్డు ప్రమాదంలో ‘గీతం’అధినేత మృతి.

విశాఖపట్నం:
గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి అల్కాసకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అమెరికాలోని తెలుగుసంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదంలో ‘మూర్తి’తో పాటు ‘వెలవోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్‌, వి.బి.ఆర్‌.చౌదరి(చిన్నా) మృతి చెందారు. వీరితో పాటు ప్రయాణిస్తోన్న ‘కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలిఫోర్నియా నుంచి అల్కాసకు వెళుతున్న వీరి కారును ఫోర్ట్‌ ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ నెల 6వ తేదీ జరగనున్న ‘గీతం’ పూర్వ విద్యార్థుల సమావేశంలో ‘మూర్తి’ ప్రసంగించవలసి ఉంది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ‘మూర్తి’ ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి తొలిసారి 1989లో విశాఖపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు చెందిన ఉమాగజపతిరాజుపై గెలుపొందిన మూర్తి 1999లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తరువాత 2004 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్థన్‌రెడ్డిపై ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం సీటును బిజెపికి కేటాయించడంతో..’మూర్తి’ని ఎమ్మెల్సీగా చంద్రబాబు నామినేటెడ్‌ చేశారు.