యుద్ధంలో విజయం కాంగ్రెస్‌దే. -మల్లు భట్టి.

హైదరాబాద్:

ప్రజల అవసరాలు, ఆకాంక్షలే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో ప్రచార కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో డీకే అరుణ, విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. 2019లో జరగాల్సిన ఎన్నికలు 2018లో రావటానికి కారణమైన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. దీనికి మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకు అధికారులతో కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. అయినా ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎన్నికల సభల్లో, సమావేశాల్లో రాహుల్, సోనియాగాంధీ పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరాలని గద్దర్‌ను ఆహ్వానించామన్నారు. విమలక్క, గోరేటి వెంకన్న కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.డీకే అరుణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ చేసిన మోసాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై ప్రచార కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. ప్రజలను నమ్మించి, మోసం చేసిన టీఆర్ఎస్‌కు ఓటు అడిగే హక్కులేదని చెప్పారు. విజయశాంతి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధమవుతున్నామన్నారు. విజయం కాంగ్రెస్‌దేనని స్పష్టంచేశారు.