లండన్ వీధుల్లో మరమరాల మసాలా!!

భారత్ వీధుల్లో ఎక్కడ చూసినా భేల్ పురీ బళ్లు కనిపించడం సర్వసాధారణం. కానీ అదే దృశ్యం లండన్ వీధుల్లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. నవ్వులాట కాదు.. ఇది నిజం. లండన్ లో మన మరమరాల మసాలాని ఒక ఇంగ్లిష్ షెఫ్ అమ్ముతున్నాడు. అది కూడా సూపర్ హిట్టయి ఇప్పుడు ఆయన బండి యమ పాపులర్ గా మారింది.

బ్రిటన్ కి చెందిన యాంగస్ దీనోన్ వృత్తిరీత్యా ఒక షెఫ్. ఓ సారి భారత్ పర్యటనకు వచ్చినపుడు ఇక్కడ వీధుల్లో దొరికే ఆహారపదార్థాలను రుచి చూశాడు. అంతే.. ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిన వెంటనే కోల్ కతా వీధుల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఝాల్మురీని అమ్మడం ప్రారంభించాడు. తన బండికి ఝాల్మురీ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టాడు. దానికి ఉపశీర్షిక ఎవ్రీబడీ లవ్, లవ్ ఝాల్మురీ ఎక్స్ ప్రెస్! ఇప్పుడు ఈయన దగ్గర భారతీయులే కాదు.. బ్రిటన్ దేశస్థులు కూడా లైన్లలో నిలబడి మరీ ఝాల్మురీ మసాలాను కొనుక్కొని తింటున్నారు.