మత్తు ఒక భ్రమ!! డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలకు విముక్తి!

Hyderabad :

డ్రగ్స్ కేసు వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఉన్న టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులను విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఓ సామాజిక కార్యకర్త ఈ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించగా ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసిందని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. చార్జిషీట్లలో 62 మంది పేర్లు లేకపోవడం గమనార్హం. కేసులో 62 మంది హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ తారగణంలోని ప్రముఖుల నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించిన విషయం విదితమే. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చకపోవడం గమనార్హం. అంటే పలువురు సినీ సెలబ్రెటీలకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందన్న మాట!మొత్తానికి చూస్తే.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని సిట్ తూతూ మంత్రంగానే చార్జిషీట్ల వేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను నమోదు చేసింది.

అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాల్గింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్‌పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు.

క్లీన్‌చిట్ లభించిన ప్రముఖులు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్
శ్యామ్ కే. నాయుడు
నటుడు సుబ్బరాజు
హీరో తరుణ్
హీరో నవదీప్
నవపాద ధర్మారావ్(చిన్నా)
నటి ఛార్మీ కౌర్
నటి ముమైత్ ఖాన్
హీరో రవితేజ
శ్రీనివాస్ (రవితేజ కారు డ్రైవర్)
యంగ్ హీరో తనీష్
హీరో నందుతో పాటు పలువురు

విజిలెన్స్‌కు బదిలీ చేయాలి : పద్మానాభరెడ్డి.

డ్రగ్స్ కేసులో ‘సిట్‌’ విచారణ నుంచి తప్పించి ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ ద్వారా సేకరించింది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసి, 4 చార్జ్ షీట్లు వేశామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే చార్జిషీట్‌లో సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును సిట్ నుంచి బదిలీ చేయాలని కోరారు.