కేసీఆర్ కు చెలగాటం, టిఆర్ఎస్ కు ప్రాణ సంకటం!!

Kcr

ఎస్.కె. జకీర్.

అధికారంలో ఉన్న రాజకీయపార్టీ ‘పాజిటివ్’ ప్రచారాన్ని సాగిస్తుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ‘నెగెటివ్’ ప్రచారాన్ని కొనసాగిస్తాయి. ఎన్నికల వేళ సాధారణంగా కనిపించే దృశ్యం ఇది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఇందుకు భిన్నంగా జరుగుతున్నది. ‘రీ ఇంజనీరింగ్ ‘ లాగా ఎన్నికల ప్రచార సరళిని సైతం కేసీఆర్ ‘రీ డిజైను’ చేశారు. ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ సారధ్యంలోని ‘ప్రజాకూటమి’ ని తిట్టిపోస్తూ అధికారపక్షం టిఆర్ఎస్ ప్రచారం దూకుడుగా సాగుతున్నది. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ హామీల ఉల్లంఘనపై కాంగ్రెస్ ప్రచారం సాగుతున్నది. ప్రత్యర్థులపై ‘అటాక్’ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆమనకు ఆ కిక్కే వేరు. ”చంద్రబాబు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. చీరి పారేస్తాడు” అని కేసీఆర్ అంటే నిజంగానే చంద్రబాబు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నట్టు కాదు. ఆయన ఏమి చెప్పినా సామాన్య ప్రజలు ‘విజువలైజ్’ చేసుకునేలా మంత్రించి మాట్లాడుతారు. చంద్రబాబు ప్రమాదకారి అని కేసీఆర్ ప్రజల మనస్సుల్లో బలంగా నాటాలనుకుంటున్నారు. కనుక ఆయన ఇలాంటి పదాలు, వాక్యాలు, చమత్కారాలు విరివిగా మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. సమస్యేమిటంటే చంద్రబాబు, కేసీఆర్ ఒకే ‘స్కూల్’ నుంచి వచ్చారు. ఎన్నికల సమయాల్లో ఎత్తుగడలు, వ్యూహాలపై ఇద్దరూ ఒకే రకమైన పాఠాలను అనుసరిస్తుంటారు. ”కాంగ్రెస్ చచ్చిన పాము. దానికి చంద్రబాబు ఆక్సిజన్ ఇస్తున్నారు” అని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కాకతాళీయంగా చెప్పలేదు. కేసీఆర్ కుటుంబమంతా ఈ దిశగా చాలా హోమ్ వర్కు చేస్తున్నది. కాంగ్రెస్ కూటమిలో ప్రధాన భాగస్వామిగా మారిన తెలుగుదేశం పార్టీ వల్ల ‘ముప్పు’ ఉన్నట్టు కేసీఆర్ భావిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా అర్ధమవుతుంది. కానీ తన దగ్గర అద్భుత ‘మంత్రదండం’ ఉన్నట్టు కూడా ఆయనకు అపార నమ్మకం ఉన్నది. కానీ ప్రభుత్వ అనుకూల ఓట్లు రాబట్టడం అంత సులభం కాదని ,పాజిటివ్ ఓట్లతో మళ్ళీ అధికారం చేబట్టడం సాధారణ విషయం కాదని వివిధ రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల అనుభవాలు చెబుతున్నవి. వాటిని కేసీఆర్ నమ్మవచ్చ్చు, నమ్మకపోవచ్చు. తనపై తనకున్న విశ్వాసం అటువంటిది. ఒంటిచేత్తో వంద సీట్లు గెలిపించుకొని వస్తానని కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. కర్ణాటకలో గత మే లో ఎన్నికలు జరిగాయి. 2013 ఎన్నికల్లో 122 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొని అధికారం చేబట్టిన సంగతి తెలిసిందే. పలు రకాల ప్రజాకర్షక పథకాలను అమలు చేసినా ఫలితం లేకపోయింది. అభివృద్ధికి మారుపేరుగా కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గుర్తింపు పొందారు. ఆ ధీమాతోనే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ భావించింది. 122 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 104 మందికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చింది. అందులో 59 మంది ఓడిపోయారు. అంటే 60 శాతం మంది ఓడిపోవడం విశేషం. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలలో 78 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ తెలంగాణలోనూ కేసీఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్థులకు టికెట్టు ఖరారు చేశారు. 95 శాతం సిట్టింగ్ లకు ఇచ్చిన ‘ఖ్యాతి’ కోసమే ఆయన ఈ పని చేసి ఉండవచ్చు. ఈ సాహసం చేసి ఉండవచ్చు. తన ఛరిష్మా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే పార్టీ అభ్యర్థులను గెలిపించగలవని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో దాదాపు 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఆదరణ కోల్పోయినా వారిని మార్పు చేయకపోవడం కేసీఆర్ ‘విశ్వాసానికి’ మచ్చు తునక. గెలుపుపై ధీమా తోనే ఈ సాహసం చేసినట్టు భావిస్తున్నారు. సిట్టింగులపై ఎంతో కొంత వ్యతిరేకత సహజంగా ఉంటుంది. సరిగ్గా పనిచేయకపోడమో, ప్రజలతో సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో, ప్రజల్ని పట్టించుకోకపోవడమో, ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేయడమో, లేదా ఆస్తులు పోగు చేసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించడం వంటి అంశాలు, అవినీతి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం పై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఛరిష్మ కొంతవరకే సదరు అభ్యర్థికి ప్రయోజనం కలిగించవచ్చును. మిగతా అంతా అభ్యర్థుల గుణగణాలపైనే కేంద్రీకృతమవుతుందని వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నవి. పార్టీ గుర్తు ఎంత శక్తివంతమైనా అభ్యర్థులపై ‘వ్యతిరేకత’ ఉంటె ఆ గుర్తు గెలుపు అంచుదాకా తీసుకెళ్లకపోవచ్చునని ఆయా ఫలితాల సరళి స్పష్టం చేస్తున్నది.కర్ణాటకలో ఫలితాలను ముందుగా అంచనా వేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో కింగ్ మేకర్ అయిన జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల ముందు వరకు గెలుపుపై కాంగ్రెస్ ధీమా కనబరిచింది. కాంగ్రెస్ ఓటమికి కారణం ఏమిటని రాజకీయ పండితులు విశ్లేషించారు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని వాళ్ళు తేల్చారు. ఆయన అతి విశ్వాసమే కాంగ్రెస్ పుట్టి ముంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పలు నివేదికలు బయటపెట్టినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు.ప్రభుత్వ పథకాలు ప్రజలను ఆకర్షించలేకపోవడంతోపాటు, ప్రభుత్వ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఓ కారణమని అభిప్రాయం వ్యక్తమైంది. మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు కాంగ్రెస్ నుంచి దూరం కావడంతోపాటు పాటు సొంత సామాజిక వర్గమైన కురుబ కమ్యూనిటీ నుంచి సహకారం లేకపోవడం కూడా కాంగ్రెస్ ఓటమికి ఓ కారణమన్నది మరొక విశ్లేషణ. మరోవైపు లింగాయత్‌లను ప్రత్యేక మంతంగా గుర్తిస్తామంటూ ఇచ్చిన హామీ బూమరాంగ్ అయి ఆయనకే తగిలింది. వీటన్నింటినీ పక్కన పెడితే మోదీ మ్యాజిక్ ముందు, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య తేలిపోయారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో బూత్ లెవెల్ స్థాయి నుంచి వ్యూహాలు రచించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు షా వ్యూహాలకు అనుగుణంగా పనిచేశారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ‘మ్యాజిక్ ఫిగర్‌’ను దాటకపోవడానికి తెలుగు ఓటర్లే కారణం అని తేలింది. కర్ణాటక ఎన్నికల వ్యవహారం వేరు. అక్కడి ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు వేరు. తెలంగాణలో అవే అంశాలు ప్రభావితం చేస్తాయని కరాఖండిగా చెప్పలేము. కాకపోతే కొద్దిగా అటూ ఇటూగా ప్రధాన అంశాలు అలాగే ఉంటాయి. ప్రభుత్వ పాలనా తీరు, ప్రజలతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సహచర మంత్రుల సంబంధాలు, కేసీఆర్ చెబుతున్న 450 కి పైగా అమలైన సంక్షేమ కార్యక్రమాల ఫలాలు సామాన్య ప్రజలకు అందిన తీరు, కింది స్థాయిలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు, ఎమ్మెల్యేల అహంకారం, మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన అవినీతి, ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ నాయకుల పాత్ర…. వంటి అనేక అంశాలు ఎన్నికలను, ఓటర్లను ప్రభావితం చేయనున్నవి. దళితులకు మూడెకరాల భూమి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఇంటింటికి నల్లా పేరుతో చేపట్టిన ‘మిషన్ భగీరథ’ , నిరుద్యోగుల్లో అసంతృప్తి, యువతలో నిరాశా నిస్పృహలు వంటి పలు అంశాలను కేసీఆర్, ఆయన పార్టీ ఎదుర్కోవలసి ఉన్నది. నాలుగున్నరేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ‘ధనిక రాష్ట్రం’ అయిపోయిందన్న వాదనలో పస లేదు. అనేక కారణాల వల్ల , ముఖ్యంగా పుష్కలంగా ఉన్న వనరులు, మౌలిక సదుపాయాల వల్ల ఇదివరకే తెలంగాణ ప్రాంతం ‘రిచ్’ రాష్ట్రమే. గడచిన నాలుగున్నరేళ్లలో పలు ఉప ఎన్నికల్లో, జి.హెచ్. ఎం.సి సహా అన్ని చోట్లా కేసీఆర్ ఎదురులేని మనిషి. గెలుపు కిక్కుతో, విజయగర్వంతో ఉన్నవారికి, ”మళ్ళీ అధికారం మాదే” అని గట్టిగా నమ్ముతున్న వారికి హితవులు, సూచనలు,ఆలోచనలు వినే సహనం, సమయం ఉండవు. వాటిని వినవలసిన అవసరం లేదని వాళ్ళు భావిస్తుంటారు.