కేటీఆర్ – జగన్ భేటీ!! పుంజుకున్న’రిటర్న్ గిఫ్ట్’ స్కీం !!

కేటీఆర్ – జగన్ భేటీ!!
పుంజుకున్న’రిటర్న్ గిఫ్ట్’ స్కీం !!

TRS Party Working President KTR Meet With Jagan
ఎస్.కె.జకీర్.

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిరువురు చర్చలు జరపనున్నారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో తలపెట్టిన నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి ‘కూటమి’ నిర్మాణానికి జరుగుతున్న సన్నాహాలలో ఇదొక ముఖ్య ఘట్టం. ఇప్పటికే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ కేసీఆర్ వైసీపీతోనూ చర్చించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో చర్చలు జరపాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ ఎంపీ వినోద్ , పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ లను కేసీఆర్ ఆదేశించారు. బుధవారం కేటీఆర్‌ బృందం జగన్ తో చర్చలు జరపనుంది. జగన్‌ నివాసం ‘ఫెడరల్ ఫ్రంట్’ చర్చలకు వేదిక కానున్నది. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించి తీరతామని ఇటీవల కేసీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టిడిపి వ్యతిరేక ప్రచారానికి సంబంధించి మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే కార్యాచరణ చేపట్టారు.చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆంధ్రా పర్యటన సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడలోని దుర్గమ్మని దర్శించుకున్న తలసాని తర్వాత భీమవరం కూడా వెళ్లారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ‘రిటర్న్ గిఫ్ట్’ ఏ రూపంలో ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని తలసాని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో యాదవులు సంఘటిత శక్తిగా ఎదగాలని సనత్ నగర్ శాసన సభ్యులు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.విజయవాడలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు.విజయవాడ డిప్యూటీ మేయర్ సత్యనారయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన యాదవ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్ కు ఘన స్వాగతం పలికారు.తెలంగాణాలో కెసిఆర్ యాదవులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారన్నారు.రాజ్య సభ సీటు కూడా యాదవులకు ఇచ్చి గౌరవించారన్నారు.ఆంధ్రలో మాత్రం ప్రభుత్వం యాదవులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆంధ్రలో ఉన్న యాదవులు పార్టీలకు అతీతంగా సంఘటితం కావాలని తలసాని శ్రీనివాస యాదవ్ పిలుపునిచ్చారు.జనాభా ప్రాతిపదికన యాదవులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.యాదవులు ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలన్నారు.