టీఆర్ఎస్ పార్టీ లోకి జలగం ప్రసాద్.

TrsParty

ఖమ్మం :

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెద్ద కుమారుడు… మాజీ మంత్రి… సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం ప్రసాదరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెంది ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇవాళో రేపో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు కేటీఆర్ తో మాటా మంతీ కూడా అయినట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో ఇరవై సంవత్సరాల క్రితం జలగం ప్రసాదరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఆ సస్పెన్షన్ కాలపరిమితి కూడా ఎప్పుడో పద్నాలుగేళ్ల క్రితమే తీరిపోయినప్పటికీ రాజకీయంగా కొంత స్తబ్ధుగా ఉండి పోయారు ప్రసాదరావు. అప్పట్లో పార్టీకీ ఆయన అవసరం పెద్దగా లేకపోయింది… ఆయన కూడా పార్టీ తనను పట్టించుకోవడం లేదు కాబట్టి తనవైపు నుంచి కాంగ్రెస్ లోకి మళ్లీ రావాలని ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి పోయారు.
అయితే ఈ మధ్య కాలంలో అనుచరుల నుంచి, అభిమానుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఒత్తిడి రావడంతో మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లారు. ఇప్పుడున్న రాజకీయ అవసరాల దృష్ట్యా ఖమ్మం జిల్లాలలో పార్టీకి ఆయన సేవలు అవసరమన్న ఆలోచనతో ఏఐసీసీ లెవెల్లో రెండు నెల్ల క్రితమే ఆయనపై ఉన్న స్పెన్షన్ ఎత్తేసారు. అయితే ఏఐసీసీ ఆదేశాలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమలు చెయ్యకుండా… జలగం ప్రసాదరావుకి సంబంధించిన సస్పెన్షన్ ఎత్తివేతను అధికారికంగా ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. రెండు నెలలైనా టీపీసీసీ ప్రసాదరావు విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇందుకు తమ జిల్లాలో ఇప్పుడు చక్రం తిప్పుతున్న ఓ ముగ్గురు నాయకులే కారణమని భావించిన జలగం ప్రసాదరావు కినుక వహించి మళ్లీ స్తబ్దుగా ఉండిపోవాలనే ఆలోచనకి వచ్చేశారు. ఓ పక్కన మహా కూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ల కలయిక టీఆర్ఎస్ వెన్నులో వణకు పుట్టిస్తున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ బలపడాలనే ఆలోచన చేస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిస్తే ఖమ్మం జిల్లాలో ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్ధితి ఉండదనేదది జగమెరిగిన సత్యం. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో జలగం ప్రసాదరావును సరిగా రిసీవ్ చేసుకోవడం లేదని గ్రహించిన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పమత్తమై కేటీఆర్ ద్వారా రాజకీయ మంత్రాంగాన్ని నడిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న బుధవారం కేటీఆర్ స్వయంగా పంజాగుట్ట హైదరాబాదులోని జలగం ప్రసాదరావు నివాసానికి వెళ్లి ఆయన్ను టీఆర్ఎస్ పార్టీలో చేరమని ఆహ్వానించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలుపు కృషి చేయాలని… పార్టీలో తమకి సముచిత ప్రాధాన్యత, గౌరవం కల్పిస్తామని ప్రసాదరావుకు.. కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని ప్రసాదరావుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ స్వయంగా ఇంటికి వచ్చి సాదరంగా ఆహ్వానించడంతో ప్రసాదరావు కూడా టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశం అవడానికి గురువారం ప్రసాదరావు ఖమ్మం వెళ్లారు. పెనుబల్లి మండలంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ఈ రోజు అభిమానులతో సమావేశం కానున్నారు. ఇక జలగం ప్రసాదరావు ఇవాళో రేపో టీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే