జర్నలిస్టు లింగంకు అండగా టీయుడబ్ల్యుజె.

జర్నలిస్టు లింగంకు అండగా టీయుడబ్ల్యుజె.
TUWJ

హైదరాబాద్:

కాలేయ వ్యాధితో ఉస్మానియా ఆసుపత్రిలో చేరి, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్ మండల ఆంధ్రజ్యోతి విలేఖరి పిండి లింగంకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) అండగా నిలిచింది. అతనికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తోంది. ఇందులోభాగంగానే శనివారం సాయంత్రం టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ఆందోల్ నియోజకవర్గ జర్నలిస్టులతో కలిసి ఉస్మానియా ఆసుపత్రిలో లింగంను పరామర్శించి అతని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు. తమ వంతు ఆర్థిక సహకారంగా రూ.10వేలను అతని భార్యకు విరాహత్ అందించారు. అంతేకాకుండా ఆర్ఎంవో డాక్టర్ నరేందర్ ను కలిసి లింగంకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్ఎంవో వెంటనే సదరు వార్డు వైద్యులతో మాట్లాడి లింగం చికిత్సపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం కొంత మెరుగ్గానే ఉందని, జాండీస్ ఎక్కువ శాతం ఉన్నందున తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుందని, ఈ క్రమంలో పూర్తి స్థాయి భరోసా ఇవ్వలేమని వైద్యులు స్పష్టం చేశారు. అయినా సాధ్యమైనంతవరకు ప్రత్యేక చికిత్స అందిస్తామని టీయుడబ్ల్యుజె నాయకులతో సదరు వైద్యులు తెలిపారు. విరాహత్ అలీతో పాటు ఆందోల్ ప్రెస్ క్లబ్ నాయకులు భూమయ్య, యాదగిరి, సంజీవ్ తదితరులు లింగంను పరామర్శించారు.