రవిప్రకాష్ పై విరుచుకుపడ్డ టీవీ 9 యాజమాన్యం.


రవిప్రకాష్ పై విరుచుకుపడ్డ టీవీ 9 యాజమాన్యం.

hyderabad:

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తమపై చేసిన ఆరోపణలకు ఆ సంస్థ కొత్త యాజమాన్యం ‘అలందా మీడియా’ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ”అబద్ధాల ప్రకాశ్ – అసలు నిజాలు” అనే పేరుతో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ”నాయనా! రవిప్రకాశ్ ఎక్కడున్నావో తెలియకపోయినా ఒక వీడియో పోస్ట్ ద్వారా జనం ముందుకు వచ్చి, ఆక్రోశాన్ని బాగానే చూపించావం”టూ ఎద్దేవా చేసింది. టీవీ9ను తానే స్థాపించానని, శ్రీనిరాజు ఆర్థిక సహకారం అందించారంటూ రవిప్రకాశ్ చేసిన వ్యాఖ్యలపై కొత్త యాజమాన్యం తీవ్రస్థాయిలో మండిపడింది.‘‘టీవీ9 సంస్థను శ్రీనిరాజు స్థాపించారు. ఆ సంస్థలో పెట్టిన పెట్టుబడి మొత్తం ఆయనకు సంబంధించినదే. సీఈవోగా నీకు గుర్తింపు వచ్చి ఉండొచ్చు, కానీ టీవీ9 విజయం వెనుక వందలాది మంది ఉద్యోగుల కష్టం, ప్రమోటర్ల పెట్టుబడి ఉన్నాయన్న విషయాన్ని మరవొద్దు. ప్రతిఫలం ఆశించకుండా పని చేశానని చెబుతున్నావు.. టీవీ9 సీఈవోగా ఉన్న 15 ఏళ్ల కాలంలో కూడబెట్టిందేంటో నీకే తెలుస్తుంది. నిజం నీ కళ్లు తెరిపిస్తుంది. రామేశ్వరరావు టీవీ9 సంస్థలో ప్రధాన వాటాదారనే విషయం ఒప్పందానికి ముందు నిజంగా నీకు తెలియకపోతే, ఆ ఒప్పందంపై సంతకం ఎలా చేశావు? ఎందుకు చేశావు? టీవీ9 హిందీ చానల్ భారత్‌వర్ష ప్రారంభించడానికి కావల్సిన రూ.70 కోట్ల మూలధనాన్ని రామేశ్వరరావు నుంచి తీసుకున్నప్పుడు నీకు ఎలాంటి అభ్యంతరం లేదు. సంస్థ నిర్వహణలో నియమ నిబంధనలను, పద్ధతులను, పారదర్శకతను పాటించాలని కోరినప్పుడు మాత్రమే రామేశ్వరరావుతో నీకు ఇబ్బంది ఎదురయ్యింది. కొత్త యాజమాన్యం తరపున డైరెక్టర్లు బోర్డులోకి రావాలని నిర్ణయం జరిగినప్పుడు, నీ అవకతవకలు బయటపడతాయన్న భయం నీకు పట్టుకుంది. 8 శాతం వాటాతో వంద శాతం ఫలితాలను సొంతం చేసుకోవాలని, సంస్థను ఇష్టారాజ్యంగా నడపాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఇక సాగవని తెలిసిన రోజునే నీకు జర్నలిస్ట్ విలువలు గుర్తుకొచ్చాయి. రవిప్రకాశ్, కంపెనీల చట్టంలో నిబంధనల ప్రకారం, మెజార్టీ వాటాదార్ల నిర్ణయమే చెల్లుతుంది. కంపెనీల చట్టం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ విషయం నీకు తెలిసి ఉండేది. టవీ9ను నడిపిన 15 ఏళ్లలో వాటాదార్ల అనుమతి లేకుండా, నువ్వు నీ వందమాగధుల సంతకాలతో సంస్థ నుంచి ఎన్ని డబ్బులు కొట్టాశావో లెక్కలు తేలే రోజులు రావడంతోనే, నిన్ను నువ్వు కాపాడుకోవడానికే నీకు ఒప్పందాలు గుర్తుకువచ్చాయి”అని అలందా మీడియా పేర్కొన్నది. ”ఆధారాలతో సహా పట్టుబడ్డ నీ అడ్డగోలు ఫోర్జరీలను ఏమనాలి? దబాయించడంలో ఆరితేరిపోయిన నీకు, చట్టప్రకారం చేసేవన్నీ అడ్డగోలుగానే కనిపిస్తుంటాయి కాబోలు. పోలీసుల ముందుకు వెళ్లి ఆ ఆధారాలన్నింటినీ ఒక్కసారి చూసుకుంటే, నిజం ఏంటో నీకే తెలుస్తుంది. దేవేందర్ అగర్వాల్ అనే వ్యక్తి టీవీ9 సంస్థలో కంపెనీ సెక్రటరీ హోదాలో, కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం నియమితమైన పూర్తి స్థాయి ఉద్యోగి. కంపెనీల చట్టంలో ఈ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయి. టీవీ9 లోగోను సృష్టించింది నేనేనని చెప్పుకుంటున్న నువ్వు… ఇందుకు సంబంధించి కాపీరైట్ చట్టంలోని నిబంధనలను కాస్త చదువుకో. ఈ చట్టం ప్రకారం లోగోను డిజైన్ చేసిన, లేదా చేయించిన వ్యక్తి ఆథర్ అవుతారు. అన్నిరకాల కాపీరైట్స్ కు ఇదే నిబంధన వర్తిస్తుంది. ఒక ఉద్యోగిగా కంపెనీ జీతం తీసుకుని నువ్వు చేసింది ఇదే. టీవీ9 లోగోలు మొదట్నుంచీ కూడా ఏబీసీఎల్ పేరుమీదే ఉన్నాయి తప్ప, రవిప్రకాశ్ అన్న పేరు మీద లేవన్న విషయాన్ని కాస్త గుర్తు తెచ్చుకో. ఎన్సీఎల్టీలో పిటిషన్‌ను అడ్డు పెట్టుకుని… ఇద్దరు వ్యక్తుల మధ్య 40 వేల షేర్ల మార్పిడి కుదరదంటూ నానా హంగామా సృష్టించిన నువ్వు, ఏకంగా కంపెనీకి బ్రాండ్ అయిన టీవీ9 లోగోలను కేవలం రూ.99 వేలకు అమ్మే ప్రయత్నం చేయడం నీకున్న అతితెలివితేటలకు నిదర్శనం కాదా? విలువల గురించి నువ్వు మాట్లాడుతుంటే… దొంగే దొంగని అరిచినట్లుగా అందరికీ అనిపిస్తోంది. ఈ విషయం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. జర్నలిస్టునని చెప్పుకుంటూ, సంస్థను అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు, సాగించిన అక్రమాలు వేలల్లో ఉన్నాయి. ఆ బాధితులందరూ నీ ముందుకు వస్తే, నీ విలువలేంటో నీకు తెలిసొస్తుంది’’ అంటూ రవి ప్రకాశ్ ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడింది.