ఉత్తమ్ వర్సెస్ కేటీఆర్.. జోర్దార్ ట్వీట్ వార్!!

హైదరాబాద్:
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచార సభలకే పరిమితమైన మాటల యుద్ధానికి ఇప్పుడు సోషల్ మీడియా కొత్త వేదికగా మారింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ వర్సెస్ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా సెటైర్లు, కౌంటర్లు పేలుతున్నాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తే పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయొద్దని కేటీఆర్ హితవు పలికారు. దీనికి జవాబుగా మాకు అసభ్య, అశ్లీల భాషతో తమ రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నవారి నుంచి మంచిచెడుల పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. కేసీఆర్ నోటిదురుసు, పోలీసుని చితకబాదిన హరీష్ రావు, పోలీసులను బూతులు తిట్టిన నీ గురించి తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసంటూ ఓ వీడియో క్లిప్ పోస్ట్ పెట్టారు. దీనికి కౌంటర్ గా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరెక్కడ ఉన్నారని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రుల కోటు తోకలు పట్టుకొని ఖజానా దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పోరాటంలో తన పాత్ర గురించి సగర్వంగా చెప్పుకుంటానని తెలిపారు. పోలీసుని తిట్టిన విషయంలో ఆయనకు బహిరంగ క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు. కానీ రూ.3 కోట్ల నగదు తగలబెట్టిన వ్యవహారాన్ని ఒప్పుకుంటారా? అని ఉత్తమ్ ని నిలదీశారు.