సైకిలెక్కనున్న ‘రాధా’..!?

సైకిలెక్కనున్న ‘రాధా’..!?

vangaveeti radha krishna

అమరావతి:

ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్‌ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. అయితే టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతాయి.అయితే ఇది ఎంతవరకు నిజం..? నిజంగానే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే జనసేన కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా గత కొద్దిరోజులుగా రాధా.. జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఏ పార్టీలో చేరతారనేదానిపై క్లారిటీ రావాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.వంగవీటి రాధా వెంట పలువురు కార్పొరేటర్లు వెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామాతో ఆయన మద్దతుదారులు కూడా వైసీపీని వీడుతున్నారు. ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. రాధాకృష్ణకు మద్దతుగా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి లేఖలను వైసీపీ కార్యాలయానికి పంపారు. విజయవాడ కార్పొరేషన్‌లోని 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత, 15వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్, 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మద్దాల శివశంకర్‌, 18వ డివిజన్‌ కార్పొరేటర్ పాల ఝాన్సీలక్ష్మిలు వైసీపీకి రాజీనామా చేశారు.
పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ తామంతా రాధా వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటాయన్నారు. కాగా, రాధాతోపాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా పార్టీని వీడుతుండడం కృష్ణా జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ వైసీపీ కీ రాజీనామా చేసి ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.