ఖలీల్ అహ్మద్ పై భగ్గుమన్న మిస్టర్ కూల్!!

ఖలీల్ అహ్మద్ పై భగ్గుమన్న మిస్టర్ కూల్!!

న్యూఢిల్లీ:

అడిలైడ్ వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను 1-1తో సమానం చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 39వ వన్డే సెంచరీతో నిర్మించిన గెలుపు బాటపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్ జట్టుని విజయతీరాలకు చేర్చారు. కోహ్లీ ఔటయ్యే సమయానికి జట్టుకి 38 బంతుల్లో 57 పరుగులు కావాలి. ధోనీ, కార్తీక్ (14 బంతుల్లో 25 నాటౌట్) కలిసి వికెట్ పడకుండా గెలిపించారు. బెహ్రాన్డార్ఫ్ చివరి ఓవర్లో 6 బంతుల్లో 7 పరుగులు కావాలి. మొదటి బంతిని ఎంఎస్ అద్భుత సిక్సర్ గా మలిచి స్కోరు సమం చేశాడు. తర్వాత బంతికి ఒక చీకీ సింగిల్ తీసి భారత్ ను గెలిపించాడు.
తన ఇన్నింగ్స్ లో ధోనీ 2 సిక్సర్లు బాదాడు. 54 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంటే మిగతా రన్స్ వికెట్ల మధ్య పరుగెత్తే తీశాడు. చివరి ఓవర్లలో ధోనీకి కాస్త అసౌకర్యం ఏర్పడటంతో ఫిజియోని పిలిపించాల్సి వచ్చింది. ఈ సమయంలో డ్రింక్స్ బ్రేక్ ప్రకటించారు. రిఫ్రెష్ మెంట్స్ తీసుకొని ఖలీల్ అహ్మద్ మైదానంలోకి వచ్చాడు. కార్తీక్ కి నీళ్లు అందించేందుకు పిచ్ మీద నడుచుకుంటూ వెళ్లాడు. ఇది చూసి ధోనీకి కోపం వచ్చింది. తిరిగి వెళ్తున్న ఖలీల్ ను గట్టిగా మందలించాడు. ట్విట్టర్ లో కొందరు ఫ్యాన్స్ ఈ సంఘటన వీడియోని షేర్ చేశారు.