నాలెడ్జికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్. ఐనవోలులో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్‌కు శంకుస్థాపన.

నాలెడ్జికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్.
ఐనవోలులో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్‌కు శంకుస్థాపన.

XLRI Foundation

అమ‌రావ‌తి:

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలెడ్జికి చిరునామాగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోని ఐనవోలు వద్ద గురువారం మధ్యాహ్నం దేశంలోని బి-స్కూల్స్‌లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఎక్స్ఎల్ఆర్ఐ దక్షిణ భారతదేశంలో మొదటి క్యాంపస్‌ని అమరావతిలో నెలకొల్పుతోందని, దాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఈ రోజు చాలా మంచి రోజన్నారు. 1949లో ప్రారంభమైన ఈ సంస్థకు జంషెడ్ పూర్, భువనేశ్వర్ లలో క్యాంపస్ లు ఉన్నాయని తెలిపారు. మనం 50 ఎకరాల భూమి ఇస్తే రూ.235 కోట్లతో ఇక్కడ క్యాంపస్ నిర్మిస్తున్నారని చెప్పారు. దేశంలో అత్యున్నత విద్యా సంస్థగా ఈ క్యాంపస్ ఎదగాలన్నా ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యున్నత పరిశోధనా సంస్థలతో ఈ సంస్థ అవగాహనా ఒప్పందాలు చేసుకుంటుదని తెలిపారు. ఈ సంస్థ నిర్మించబోయే అంతర్జాతీయ పాఠశాలకు 8 ఎకరాల భూమి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దేశంలోని టాప్ 20 విద్యా సంస్థలలో కనీసం పది సంస్థలకు ఇక్కడకు రప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి సంస్థలు వచ్చాయని, ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ కూడా వచ్చిందన్నారు. భవిష్యత్‌లో దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలన్నీ ఇక్కడే కొలువవుతాయని చెప్పారు. నాలెడ్జిపై పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాజధాని అమరావతి నాలెడ్జి ఎకనామికీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నాలెడ్జి ద్వారానే అన్ని రంగాల్లో సమర్థవంతమైన నాయకత్వం పెంపొందుతుందన్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఆస్తి అన్నారు. అటువంటి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల చొరవ, త్యాగం రాష్ట్రం మరువదని చెప్పారు. ఇప్పటి వరకు చదువులు, ఉద్యోగాల కోసం మనం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లేవారమని, ఇక ముందు ప్రపంచమే మన వద్దకు వస్తుందన్నారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం ఐఐటి, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యలయం, ఏఐఎంఎస్ .. వంటి 11 విద్యాసంస్థలను ఏర్పాటు చేయవలసి ఉందని చెప్పారు. వాటి కోసం 2,912 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. అంతే కాకుండా వాటి కాంపౌండ్ వాల్స్ కోసం రూ.132 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలోని వంద టాప్ విశ్వవిద్యాలయాలలో ఆరు మన రాష్ట్రంలోనే ఉన్నట్లు తెలిపారు. 30 దేశాలు 679 మంది విద్యార్థులను ఎంపిక చేస్తే వారిలో 258 మంది ఆంధ్రప్రదేశ్ వారే ఉన్నట్లు చెప్పారు. ఎవరు అడ్డుకున్నా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని, అనుకున్న లక్ష్యానికి అన్నీ పూర్తి చేస్తామన్నారు. శంకుస్థాపన చేసిన రోజే దాని ప్రారంభోత్సవ తేది నిర్ణయిస్తున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియా మోటార్స్ తొలి కారు ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 29న రోడ్డెక్కనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సంస్థ కూడా 8 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా డక్ట్ ద్వారా గ్యాస్, మంచినీరు, సమాచార కేబుల్స్,మురుగు నీరు పారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే రాజధాని మొత్తానికి ఒకేచోట ఏసీ యూనిట్ ఏర్పాటు చేసి కావలసిన ఇంటికి పంపించే వ్యవస్థ గురించి పరిశీలించమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా అమరావతిలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. మొక్కలు ఎక్కవగా నాటి చెట్లను పెంచవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ప్రకృతి సేద్యం ద్వారా మంచి ఆహారం, మంచి గాలితోపాటు కృష్ణా నది నుంచి మంచినీరు అందిస్తే వందేళ్లకుపైగా బతకడానికి అవకాశం ఉంటుందన్నారు. అమరావతిని ఆనందనగరంగా, దేవతల రాజధానిగా అభివర్ణించారు. ఎక్స్ఎల్ఆర్ఐకు ప్రభుత్వం, సీఆర్డీఏ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయని, నిర్మాణాలు వేగంగా పూర్తి అవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో మంత్రి డాక్టర్ నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్స్ సీ టాచర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జానీమూన్, మంగళగిరి మునిసిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంటూరు బిషప్ ఫాదర్ బి చిన్నబత్తిని, విజయవాడ బిషప్ ఫాదర్ టీ జోసెఫ్ రాజారావు, ఆంధ్ర జోసూట్ ప్రావిన్స్, ప్రావిన్సియల్ ఫాదర్ పీఎస్ అమల్‌రాజు, ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్ పూర్ డైరెక్టర్ ఫాదర్ ఈ.అబ్రహం, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ డీన్ ఫాదర్ జెరోమ్ కుటిన్హా, అకడమిక్ డీన్ డాక్టర్ అశీష్ కె పాణి, అమరావతి చీఫ్ అడ్మినిస్ట్రేటిల్ ఆఫీసర్ ఫాదర్ కె.ఎస్.కాసిమర్ తదితరులు పాల్గొన్నారు.