వివేకా హత్య! నేరపరిశోధన !!

వివేకా హత్య! నేరపరిశోధన !!

Ratnakumar.M.D.

కేసీఆర్ తో కలిసి పనిచేస్తే తప్పేంటి? అనే ప్రశ్న కొంత రాజకీయ ఇబ్బందిని కలిగించినా ఎలాగో సర్దుబాటు చేసుకోవచ్చు! కానీ వైఎస్ వివేకా హత్యపై దర్యాప్తు చేస్తున్న.’సిట్’ బృందం తన తుదినివేదికను ప్రభుత్వానికి సమర్పించకుండా చూడాలని హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేయటం మాత్రం..ఎన్నికల ముంగిట వైసీపీకి శరాఘాతమే. సిట్ నివేదిక ఓటర్లను ప్రభావితం చేస్తుందని పిటిషనర్ ఆందోళనను వ్యక్తం చేయడం గమనార్హం. హత్యలో తమ రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉందని , చంద్రబాబే చంపించాడనీ ఎన్నికల ప్రచారంలో సైతం ఆరోపించిన జగన్..ఇప్పుడిలా సిట్ నివేదిక సమర్పణపై ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టడం సాధారణ ప్రజల్ని అయోమయానికి గురిచేసేదే! అంటే సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా వస్తుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారా? చంద్రబాబే హత్య చేసి మళ్ళీ ఆయనే విచారణ చేస్తాడట! అంటూ లక్షల జనం సమక్షంలో వదిలిన విమర్శల బాణాల్లో అంతరార్థం ఇదేనా? తాము సీబీఐ దర్యాప్తు అడిగితే ఒప్పుకోని చంద్రబాబు ప్రభుత్వం…వివేకా హత్యకేసులో తమ కుటుంబాన్ని ఇరికించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తోందన్న ఆరోపణతో చాలా వరకూ నెట్టుకురావొచ్చు. అయితే సదరు అంశంపై సిట్ దర్యాప్తు జనంలో విస్తృత చర్చకు గురైతే తనకు రాజకీయ నష్టం గణనీయంగా ఉంటుందన్నది వైసీపీ ఆందోళనగా ఉంది.
మరోవైపు హతుడు వివేకా కుమార్తె సునీత నాలుగు రకాల వాదనలు విన్పిస్తుండటం కూడా ఆమెపై వస్తున్న వత్తిడికి నిదర్శనమన్న అభిప్రాయం ఉంది. సిట్ దర్యాప్తు ముగిసే వరకూ ఎవరూ మాట్లాడొద్దని , అలా మాట్లాడితే దర్యాప్తు ‘ప్రభావితం ‘ అవుతుందని ఆమె తొలుత విజ్ఞప్తి చేశారు. ఆతర్వాత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి..దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కోరారు. ఆపై మాట్లాడుతూ.. కేసులో ప్రమేయం ఉన్నవారు తప్పించుకుని , కొందరు బలిపశువులుగా మారతారేమోనన్న సందేహాలు వ్యక్త పరిచారు. ఈలోగా ఆమె తల్లి(హతుడి భార్య) సౌభాగ్యమ్మ..హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ విధంగా ఆమె జగన్ చెప్పిందే చెప్పినట్లయింది. ఇన్ని ట్వోస్టుల నడుమ..సిట్ ఏం చెప్పినా దానిపై వివాదం రేగక మానదు. అలాంటి పరిస్థితిని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ గరిష్టంగా వినియోగించుకోవాలని ప్రయత్నిస్తాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ ఉండనక్కరలేదు.