అవును నేను మావోయిస్టునే..! – అభయ్

అవును
అతడి పేరు మావోయిస్టు
అతడి ఊరు మావోయిస్టుల చిరునామా.

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేది. కానీ అతడు తన వేళ్ళని తన అడవి నుంచి, తన శిథిల గ్రామాన్నుండీ, తన ఛిద్ర బాల్యాణనుండీ పెకలించుకోలేక పోయాడు. అందుకే ఆనవాలు కోల్పోతోన్న తన అడవికోసం గొంతెత్తాడు. “ఆదివాసీ మేధావుల ఫోరం” నిర్మించి అడవి మీద ప్రభుత్వం చేస్తోన్న దాడిని , దమనకాండని బయటి ప్రపంచానికి తెలిసేలా ఎలుగెత్తడం ప్రారంభించాడు. అంతే రాజ్యం అతడ్ని మావోయిస్టుగా గుర్తించి, అతడి మీద దాడి మొదలు పెట్టింది. వందలాది కేసులు, చిత్రహింసలు, ఆంక్షలు… లెక్కలేదు. ఇప్పుడు అతడు తాను పుట్టి పెరిగిన తన ఆదివాసీ గ్రామానికి బహిష్కృతుడు. తన పుట్టుక వల్లే కాక తన పేరువల్లా అతడు పోలీసుల దృష్టిలో ఆజన్మ నేరస్థుడు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరు నే అతడు కలిగివుండటం వల్ల ఆ అభయ్ పై నమోదు అయ్యే కేసులన్నింటిలో ఈ అభయ్ జాక్సన్ విచారణ ని ఎదుర్కోవాల్సి రావడం విషాదం.”అవును నేను ముమ్మాటికీ మావోయిస్టునే” అంటున్నాడు జాక్సన్. 1927 నాటి ఆటవిక అటవీ చట్టాలనే అనుసరిస్తోన్న సిగ్గులేని ప్రభుత్వాలు అడవిమీద ఆదివాసీలకు హాక్కు లేకుండా చేస్తున్నందుకు ప్రాణాలు కోల్పోయిన , కాళ్ళూ చేతులు కోల్పోయిన, మాయం చేయబడిన, జైళ్లలో కుక్కబడిన తన సహోదరుల సాక్షిగా తాను మావోయిస్టు ననే ప్రకటిస్తున్నాడు. 15 ఏళ్లక్రితం 10 ఏళ్ల తన తమ్ముడ్ని పోలీసులు అరెస్ట్ చేసి పెట్టిన తీవ్ర చిత్రహింసల సాక్షిగా తాను మావోయిస్టునేనని స్పష్టం చేస్తున్నాడు. బహుళజాతి కంపెనీల కోసం 40 శాతం ధ్వంసమైన తన అడివి సాక్షిగా తాను కచ్చితంగా తాను మావోయిస్టునేనని ఎలుగెత్తుతున్నాడు.మేధావుల మౌనం, నిర్లిప్తతల సాక్షిగా ఈ సోషల్ సైన్టిస్ట్ ఈ రాజ్యం ద్వారా మాయం చేయబడతాడు. ఇప్పటికే రాజద్రోహం తో సహా పలుకేసుల్ని ఎదుర్కొంటున్న ఈ ఆదివాసీ మేధావి కోసం జైళ్ళు నోరు తెరుస్తాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ద్వారా చదువుకోగలిగానని చెప్పే ఈ మేధావి అది తన వాళ్ళందరికీ దక్కేలా చేసేందుకే తన మూలాల్లోకి తిరిగి వెళ్లానని సగర్వంగా చెబుతున్న ఈ మేధావి అంబేద్కరిస్టులకు ఎంతవరకు ఆదర్శం కాగలుగుతాడు. అంబేద్కర్ రాజ్యాంగ ఫలాల్ని అనుభవిస్తున్న ఒక్క మేధావి అయినా ఈ ఆదివాసీ మేధావి కోసం గొంత్తెత్తుతాడా?