శతృవుకు శతృవు మిత్రుడు!! అటు ‘ఫెడరల్ ఫ్రంట్’, ఇటు ‘రిటర్న్ గిఫ్టు’!!

శతృవుకు శతృవు మిత్రుడు!!
అటు ‘ఫెడరల్ ఫ్రంట్’, ఇటు ‘రిటర్న్ గిఫ్టు’!!
YS Jagan KTR Meet

ఎస్.కె.జకీర్.

శత్రువుకు శత్రువు మిత్రుడు. చంద్రబాబు కేసీఆర్ కు శత్రువు. చంద్రబాబుకు జగన్ శత్రువు. కనుక జగన్ కేసీఆర్ కు మిత్రుడే కదా!జగన్, టిఆర్ఎస్ ల మధ్య బుధవారం చర్చలు బహిరంగంగా జరిగాయి తప్ప కేసీఆర్, జగన్ ల మధ్య ‘ మైత్రీ బంధం’ చిగురించి చాలా కాలమే అయింది. ఇటీవలి తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మీడియాలో టిఆర్ఎస్ ప్రచారానికి సంబంధించిన ‘కవరేజ్’ ను పరిశీలిస్తే ఆ విషయం అర్దమవుతుంది. ఎన్నికలు ముగిసీ, ముగియగానే కేసీఆర్ కు జగన్ ఫోన్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. తానే ఫోన్ చేసి కేసీఆర్ తో మాట్లాడానని జగన్ స్వయంగా చెప్పుకున్నారు. ” ఇందులో ఎలాంటి సందే‍‍హం వద్దు. నేను ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అభినందించా. అన్నా… భలే గెలిచావే.. చంద్రబాబును బాగా ఓడించావ్ అని అన్నా. ఇందులో తప్పేముంది. నేను చంద్రబాబులా తప్పులు మాట్లాడను” అని జగన్ స్పష్టం చేశారు. తెలంగాణలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కు బలం లేనందున ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావదానికి కేసీఆర్ కూడా సహకరిస్తానని చెప్పారని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని జగన్ అన్నారు. ” ఆంధ్రప్రదేశ్ లో 25 మంది ఎంపీలున్నారు. తెలంగాణలో 17 మంది ఎంపీలున్నారు. వీరందరూ పార్లమెంటులో మాట్లాడితే ప్రత్యేక హోదా తప్పక వస్తుంది. అందుకే నేను కేసీఆర్ కి మద్దతు పలుకుతున్నాను ” అని జగన్ చెప్పారు. ఈ పూర్వరంగంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ బృందం జగన్‌తో భేటీ అయ్యింది. ఫెడరల్ ఫ్రంట్‌ లో చేరవలసిందిగా జగన్ ను కేటీఆర్ కోరారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు పురోగతిని కేటీఆర్ వివరించారు. కేటీఆర్‌ బృందంలో ఎంపీ లు సంతోష్ జోగినపల్లి, వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.