లంచాలు, సిఫారసులు లేని ఏపి. – కొత్త సీఎం జగన్ ప్రతిన.


Amaravathi:

“వైఎస్ జగన్ అనే నేను ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను.3600 కిలోమీటర్లు, ఈ నేల మీద నడిచినందుకు , గత తొమ్మిది సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు , ప్రతి సోదరుడికి, స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.వేదికపై ఉన్న పెద్దలు, ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదే విధంగా రేపు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని ఆకాంక్షిస్తూ స్టాలిన్ గారికి , ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరుపేరునా నమస్సుమాంజలులు తెలుపుకుంటున్నా.పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో ..3600 కిలోమీటర్ల పాదయాత్రలో…పేదలు పడిన కష్టాలు చూశా, మధ్యతరగతి ప్రజల బాధలు విన్నాను, మీ కష్టాలు చూసిన తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీకందరికీ ఇవాళ ఒక మాటిస్తున్నాను.మీ కష్టాలను నేను చూశాను. మీ బాధలను నేను విన్నాను. మీ అందరికీ నేనివాల చెప్తున్నాను. నేను ఉన్నాను.అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే రెండే రెండు పేజీలతో..ప్రజలకు ఎప్పటికీ గుర్తుండేలా, కనిపించేలా తీసుకొచ్చాం..
గత ప్రభుత్వాల మాదిరి మేనిఫెస్టోను పేజీలకు పేజీలు, బుక్ లకు బుక్ లు తీసుకురాలేదు.
ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలనే ఆలోచనతో మేనిఫెస్టో తీసుకురాలేదు.ఎన్నికలయ్యాక మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసే బుక్ లా తీసుకురాలేదు.
మేనిఫెస్టో అందరికీ తెలుసుండాలి. ఎన్నికల ప్రణాళిక, ఐదేళ్లలో మనకు ఏం చేస్తాడో ప్రజలకు గుర్తుండి పోవాలి. అనుక్షణం కనిపించేలా మేనిఫెస్టోను తీసుకు వచ్చాను.మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తాను. బైబిల్ గా భావిస్తాను. ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను.ఆ మేనిఫెస్టోనే ఊపిరిగా ఈ ఐదేళ్లు మీకోసం పనిచేస్తానని ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ మాటిస్తున్నాను.అదే మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ..నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్లుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశంపై మీకు ఇపుడు చెబుతాను.అవ్వా, తాతల కోసం వాళ్ల ఆశీర్వాదాన్ని మొట్టమొదటగా తీసుకునేందుకు అవ్వాతాతల కోసం ఒక చెప్పబోతున్నా.గత ప్రభుత్వం 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అవ్వా , తాతలను పింఛన్ గురించి అడిగితే రూ.1000 అని, ఇంకొందరు రావడం లేదని చెప్పారు. అవ్వ, తాతలకు పింఛన్ గురించి ఇచ్చిన మాట మేరకు ఇవాళ నా మొట్టమొదటి సంతకం పింఛన్ల అంశంపైనే పెట్టబోతున్నా. వచ్చే ఐదేళ్లలో మాట మేరకు 3వేల వరకూ పెంచుకుంటూ పోతాం.
వైఎస్ ఆర్ పింఛన్ పేరుతో అవ్వ, తాతల పింఛన్ ను జూన్ నుంచే 2250 ఇవ్వబోతున్నాం..ఆ అవ్వా, తాతల పింఛన్ పైనే నా తొలి సంతకం చేస్తున్నా.వచ్చే సంవత్సరం 2500, ఆ తర్వాత సంవత్సరం 2750, తర్వాత వచ్చే సంవత్సరంలో రూ.3వేలు పింఛన్ హామీని నెరవేర్చబోతున్నాం. ప్రతి అవ్వా, తాతల ఆశీస్సులు కావాలని పేరు పేరున చేతులు జోడించి కోరుతున్నా. నవరత్నాలలో ప్రతి అంశం ప్రతి ఒక్కరికీ అందాలి. ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు , మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. నవరత్నాలన్నీ ప్రతి ఒక్కరికీ అందాలి.ఇవన్నీ జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలి. ఆగస్ట్ 15వ తేదీ వచ్చేసరికి… మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలివ్వబోతున్నా.
ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా..లంచాలు లేని పరిపాలన అందించేందుకు ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమిస్తాం.
గ్రామాలలో చదువుకున్న పిల్లలు , సేవ చేయాలనే ఆరాటం ఉన్న పిల్లలకి రూ.5 వేల జీతం ఇస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం.
రూ.5వేల జీతమిచ్చేది..లంచంలేని సమాజం కోసం. జీతం తీసుకుంటున్నప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన ఏ ప్రజలకు చెందాల్సిన, పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి రాకుండా , లంచాలు లేకుండా, పక్షపాతం ఉండకుండా ఉండాలని గ్రామ వాలంటీర్లకు రూ.5వేలు జీతమిస్తూ సేవా దృక్పథమున్న పిల్లలని తీసుకుని కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆగస్ట్ 15 కల్లా వాలంటీర్లు అందుబాటులోకి వస్తారు.వాళ్లందరికీ వేరే మంచి ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా కొనసాగవచ్చు.ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, పొరపాటునా లంచాలు కనిపించినా అదే ఆగస్ట్ 15వ తేదీన ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. నేరుగా సీఎంవోకి అనుసంధానం చేస్తాం.ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కనపడినా, లంచం కనపడినా..నేరుగా సీఎం ఆఫీస్ కే ఫోన్ కొట్టి చెప్పొచ్చు. నేరుగా సీఎం ఆఫీస్ నంబరే మీకు అందుబాటులో ఉంటుందని చెప్తున్నా.
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తాం.మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటరీయేట్ లో ప్రభుత్వ ఉద్యోగాలొచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నా.
ఈ కార్యక్రమం అక్షరాలా గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2వ తేదీ వరకు మరో 1,60,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని మీకు హామీ ఇస్తున్నా.పది మంది మీ గ్రామంలో మీ పిల్లలే 10 మంది గ్రామ సచివాలయంలో పని చేస్తారు.పింఛన్ రావాలన్నా, కార్డు కావాలన్నా, ఇళ్లు , స్థలాలు, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటివి ఏదీ కావాలన్నా గ్రామ సచివాలయంలోకి వెళ్లి అప్లికేషన్ పెట్టండి.అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మంజూరయ్యేట్టు చేస్తానని మాటిస్తున్నా.లంచాలుండవు. రేషన్ కార్డులివ్వాలన్నా,పెన్షన్లు కావాలన్నా, ఏది కావాలన్నా లంచాలివ్వాలి జన్మభూమి కమిటీలకు.పూర్తిగా లంచమనేది లేకుండా, రెకమెండేషన్ కు తావే లేకుండా మీలో ఏ ఒక్కరికీ ఏ అవసరమున్నా 72 గంటల్లోనే శాంక్షన్ చేస్తామని ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇస్తున్నా.మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తూ.చ తప్పకుండా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి అమలు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆరు కోట్ల ప్రజలకు మరో హామీ ఇస్తున్నా.రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని, వివక్షలేని పాలన, పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ప్రక్షాళన చేస్తామని చెప్తున్నా.అవినీతి ఎక్కడ జరిగిందో, ఏ ఏ కాంట్రాక్టుల్లో అవినీతి జరిగిందో ఏఏ పనుల్లో అవినీతి జరిగిందో వాటన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తా.అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలుపంచుకునేలా చేస్తూ, గతంలో చేసిన విధంగా టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండీషన్స్ ను పూర్తిగా మారుస్తూ, ఎక్కువ మంది టెండర్లలో భాగస్వాములయ్యేలా రివర్స్ టెండరింగ్ పాలసీని తీసుకొస్తా.చంద్రబాబు సర్కారులోని అవినీతిని మీ ముందుంచి, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్ట్ లలో ఎక్కువ మందిని పాలుపంచుకునేలా చేస్తూ, కాంట్రాక్టులలో ఏదన్నా మిగిలితే, మీకు చూపించి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత లాభమో మీకు అందరికీ చూపించే కొత్త ఒరవడి తీసుకొస్తాం.రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో తాండవిస్తుందో మరో ఉదాహరణ వివరిస్తా.సోలార్ పవర్ గానీ, విండ్ పవర్ గానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2.60పైసలకు, 3 రూపాయలకు ఒక యూనిట్ కు అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో విండ్ పవర్ యూనిట్ కు 4.80 ధర ఉంది. ఇది గత రాష్ట్రప్రభుత్వం చేసిన దోపిడీ.అదే పీక్ అవర్స్ పేరుతో దోచుకునేది చాలదన్నట్లు రూ.6 లకు యూనిట్ కు కొంటుంది. ఇవన్నీ ప్రక్షాళన విద్యుత్ ధరలు తగ్గి్స్తాం.
వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకొచ్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇవ్వబోయే కాంట్రాక్టులను పూర్తిగా ట్రాన్పరెంట్ గా ఉండేలా ముఖ్యమంత్రి హోదాలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ని కలిసి ఒక హైకోర్టు జడ్జిని మాకివ్వండి జుడిషియల్ కమిషన్ వేయమని కోరతాను.
జుడిషయల్ కమిషన్ ను నియమించి, ఆ హైకోర్టు జడ్జిని కమిషన్ కు ఛైర్మన్ గా చేస్తాం.
ఛైర్మన్ ని చేసిన తర్వాత ప్రతీ కాంట్రాక్టు టెండర్లకు పోకమునుపే జుడిషియల్ కమిషన్ కు పంపిస్తాం.ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా , ఏ రకమైనా మార్పులు చేసినా అవన్నీ టెండర్లలో మార్పులు చేసి అవినీతికి తావులేని కాంట్రాక్టర్లకు టెండర్లకు పిలుస్తాం.మన ఆంధ్రరాష్ట్రంలో మన ఖర్మ మీడియాను చూస్తున్నాం.ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ5 ను చూసినా ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు మాత్రమే కంటికి ఇంపుగా కనిపిస్తారు. మిగతా వారెవ్వరూ ఇంపుగా కనపడరు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దింపాలా అనే విధంగా వాళ్ల రాతలుంటాయ్.
ఎల్లో మీడియా వాళ్లు వక్రీకరించి రాతలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకి వెళ్లి శిక్షించమని కోరతాం.
6 నెలల నుంచి సంవత్సరం సమయం ఇవ్వండి. అవినీతి లేకుండా రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తా.
ప్రజలకు పక్కాగా రావాల్సినవి దేహీ అని అడగకుండా కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయం, పార్టీ అనేవి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా నా ప్రభుత్వంలో చేస్తా.చెరగని చిరునవ్వుతో, ఆప్యాయతలు కురిపిస్తూ ఇక్కడికి వచ్చి, రాలేక పోయిన ఆశీర్వదిస్తోన్న మీకు,దేవుడికి మీ అందరికీ , పైనున్న నా తండ్రికి, పక్కనే నా తల్లికి అందరికీ కృతజ్ఙతలు”.అని జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగం ముగించారు.