అంతటా ‘అవిశ్వాస’ కంపు. అధికారపక్షం కకావికలం.

మండలపరిషత్ లు, మునిసిపాలిటీలు అవిశ్వాస తీర్మానాల రగడ, క్యామ్పు రాజకీయాలతో అట్టుడుకుతున్నవి.అధునాతన మొబైల్ ఫోన్లు వచ్చాయని, బెదింపులకు పాల్పడితే రికార్డు చేయవచ్చునని శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎందుకు మరిచిపోతుంటారో ! తెలియదు. పైగా సామాజిక మాథ్యమాలు క్రియాశీలంగా పనిచేస్తున్నందున ఆడియో, వీడియోలు వైరల్ అయితే పార్టీకి, కేసీఆర్ కు మచ్చ వస్తుందని ఎందుకు భయపడరో! అంతుచిక్కని విషయం. అధికారంలో ఉన్నపుడుఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం భ్రమ.

ఎస్.కె.జకీర్.
తెలంగాణలో ఇటు ఖరీఫ్ అటు ‘అవిశ్వాస’ సీజన్లు ఒకేసారి వచ్చిపడ్డాయి. మండలపరిషత్ లు, మునిసిపాలిటీలు అవిశ్వాస తీర్మానాల రగడ, క్యామ్పు రాజకీయాలతో అట్టుడుకుతున్నవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంగాధర, వేములవాడ మండలపరిషద్చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల జగడం నడుస్తున్నది. ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ సమస్య చల్లారినట్టే కనిపించింది. కానీ రామగుండం, బెల్లంపల్లి,బోధన్ తదితర పురపాలక సంఘాలలో ‘అవిశ్వాస’ తుపాను కొనసాగుతున్నది. ఖమ్మం గులాబీ పోరు హైద్రాబాద్ దాకా వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అమీతుమీ తేల్చుకోవడానికి ఒక దశలో కార్పోరేటర్లు సిద్ధమయ్యారు. మేయర్ మార్పు, కమీషనర్ బదిలీని వారు కోరారు. మూకుమ్మడిరాజీనామాస్త్రంతో తిరుగుబాటుకు కూడా కార్పొరేటర్లు సిద్ధపడ్డారు. హైదరాబాద్ లో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే అజయ్ లతో ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన 32 మంది టీఆర్ఎస్కార్పోరేటర్లు సమావేశం జరిపారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తర్వాత అది తాత్కాలికంగా సద్దుమణిగింది. రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణకు, స్థానిక ఎం.ఎల్.ఏ. సోమారపు సత్యనారాయణకు మధ్య విబేధాలున్నవి. దీంతో కార్పొరేటర్లంతా ఎం.ఎల్.ఏ, మేయర్ గ్రూపులుగా చీలిపోయారు. ఎం.ఎల్.ఏ. సత్యనారాయణ సూచనల మేరకు మేయర్ లక్ష్మీనారాయణ,డిప్యూటీ మేయర్ ఎస్.శంకర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు పురపాలక మంత్రి కేటీఆర్ ఆమోదం ఉన్నట్టు రామగుండంలో జరుగుతున్న ప్రచారం. నిజామాబాద్ జిల్లా బోధన్ మునిసిపల్ చైర్మన్ పై విశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ మునిసిపాలిటీలో మొత్తం 35 కౌన్సిలర్లు ఉండగా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఒకరు రాజీనామా చేశారు. మిగతా 34 మందిలో 29 మంది మునిసిపల్ చైర్మన్ ఎల్లయ్యపై ‘అవిశ్వాసాన్ని’ ప్రకటించారు. బోధన్ చైర్మన్ పనితీరుపై నిజామాబాద్ ఎం.పి. కవిత, స్థానిక శాసన సభ్యుడు షకీల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వేములవాడ మండల పరిషత్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ పై సొంతపార్టీ నాయకులే అవిశ్వాసానికి సిద్ధపడ్డారు. రంగు వెంకటేశ్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానానికి శాసన సభ్యుడు రమేశ్ చెన్నమనేని మొగ్గు చూపుతున్నారు. ఎంపీపీపై అవిశ్వాసానికి క్యాంపురాజకీయాలు కూడా రసరంజకంగా మారుతున్నాయి. వేములవాడ మండల పరిధిలో మొత్తం 14 మంది ఎంపీటీసీలున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చెన్నమనేనిరమేష్‌బాబు గెస్ట్‌హౌస్‌లో 9 మంది ఎంపీటీసీలు చేరుకున్నారు. ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు టీఆర్ఎస్‌ ఎంపీటీసీ సభ్యులు, ఒకరు బీజేపిసభ్యుడున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపుఎంపీపి రంగు వెంకటేశ్‌గౌడ్‌ శిబిరంలో నల్గురుటీఆర్ఎస్‌ ఎంపీటీసీ సభ్యులు, ఒకరు బీజేపిసభ్యుడున్నారు. మెజార్టీ ఎంపీటీసీ సభ్యులను పార్టీల కతీతంతాఒక్కతాటిపైకి తెచ్చిన ఎమ్మెల్యే రమేష్‌బాబు ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానానికి తెరతీసినట్టు సమాచారం. తమ పార్టీకి చెందిన ఎంపీపీపైనే ఎమ్మెల్యే రమేష్‌బాబు అవిశ్వాసానికి తెరతీయడం వెనుక మతలబేంటన్నది ఇప్పుడు చర్చ. ఎంపీపీ వెంకటేశ్‌గౌడ్‌ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్ తులఉమ గ్రూపు మనిషిగా ముద్ర ఉన్నది. తుల ఉమ కోరుట్ల లేదా వేములవాడ నియోజకవర్గాల నుంచి టిక్కెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ద్వంద్వ పౌరసత్వ వివాదంలో ఎమ్మెల్యే చెన్నమనేనిరమేష్‌బాబుఇబ్బందులెదుర్కొంటున్న నేపధ్యంలో వేములవాడ టిక్కెట్‌పైనే ఆమె గట్టిగా పట్టుపట్టవచ్చునని తెలుస్తున్నది. తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతోందంటూజెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమపై కోరుట్ల, వేములవాడ శాసన సభ్యులు రమేష్, విద్యాసాగరరావు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో ‘గ్యాప్‌’ మరింత ఏర్పడింది. వేములవాడపై ఉమ ఆసక్తి చూపుతున్నందున ఆమె కు సన్నిహితుడైన ఎంపిపివెంకటేశ్‌గౌడ్‌ ను దెబ్బతీయడానికి శాసనసభ్యుడు రమేశ్ పధకాన్ని రచించినట్టు తెలుస్తున్నది. గంగాధర మండల పరిషత్‌లో ఎంపీపిపై అవిశ్వాస వ్యవహారం నాటకీయ పరిణామాలకు దారితీసింది. క్యాంప్ రాజకీయాలతో రసవత్త సస్పెన్స్‌ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఓ ఎంపీటీసి కిడ్నాప్‌ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన నేపధ్యంలోతననెవ్వరూ కిడ్నాప్ చేయలేదంటూ ఆమె పోలీసులకు వెల్లడించింది. బీజేపికి చెందిన తాడిజెర్రిఎంపీటీసిమల్లవ్వ కిడ్నాప్ వ్యవహారం తీవ్రకలకలం రేపగా తనను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ వాట్సప్ వీడియో ను పంపింది. గంగాధర మండలం తాడిజెర్రిఎంపిటీసీమల్లవ్వ మీడియా ముందుకు కూడా వచ్చారు. తనను ఎవరు కిడ్నాపు చేయలేదని, గంగాధర మండల ఎంపిటీసీలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళానని.. ఆమె చెప్పారు. తీర్థయాత్రలోనేఎంపీపిబాలాగౌడ్ వ్యవహరిస్తున్న తీరుపై అవిశ్వాసం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే తనను కిడ్నాపు చేశారంటూ అధికార టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు తన కొడుకుతో పోలీసులకు ఫిర్యాదు చేయించారని మీడియాకు స్పష్టం చేశారు.గంగాధర మండలాధ్యక్షులు దూలం బాలాగౌడ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండలానికి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీలు తిరుగుబాటు ప్రకటించారు. ఎంపిపిపై అవిశ్వాసాన్ని పెట్టేందుకు రంగం సిద్దం చేసుకున్న ఎంపిటీసీలుతీర్థయాత్రల పేరుతో క్యాంపు బాట పట్టారు. ఈఎంపీటీసీల గ్రూపులో… తాడిజెర్రిఎంపిటీసిమల్లవ్వ కూడా వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళింది. దీంతో మల్లవ్వ కుమారుడు ప్రభాకర్… తమ తల్లిని ఎవరో కిడ్నాపు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల క్రితం ఎంపీటిసిమల్లవ్వ కిడ్నాప్ అయిందనే ప్రచారం కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించడంతో… తీర్థయాత్రలో ఉన్న మల్లవ్వఅక్కడినుంచేతననెవ్వరూ కిడ్నాప్‌ చేయలేదనివాట్సప్‌లోఓ వీడియో పంపిస్తూ స్పందించింది.మున్సిపల్ చైర్మన్ల అవిశ్వాస తీర్మానాలు టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే క్యాంపులకు వెళ్లిన మెజార్టీ కౌన్సిలర్లను వెలుపలికి రప్పించేందుకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి బెడిసి కొడుతున్నాయి. బెల్లంపల్లి కౌన్సిలర్‌ను బెదిరిస్తూ ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడిన ఫోన్‌కాల్ వైరల్ అయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశం అధికార టీఆర్ఎస్‌లో దుమారం రేపుతోంది. టీఆర్ఎస్‌కు చెందిన చైర్‌పర్సన్ సునీతారాణికి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, ఇండిపెండెంట్ తదితర మెజార్టీ కౌన్సిలర్లు ఏకమయ్యారు. 34మంది కౌన్సిలర్లకు గాను 29మంది పది రోజులుగా రహస్య క్యాంప్ నిర్వహిస్తున్నారు. అవిశ్వాస నోటీసు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నయ్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు బుజ్జగించినా అసమ్మతి కౌన్సిలర్లు ఖాతరు చేయడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ నోటీసు ఇచ్చి తీరుతామని ప్రకటించినట్టుగానే గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస నోటీసు అందజేశారు ఈ పరిణామాలతో బిత్తరపోయిన చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కౌన్సిలర్‌ కూతురి పట్ల ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. ‘మీ అమ్మ క్యాంపు నుంచి రాకపోతే మీ భూవివాదాన్ని బయటకు తీస్తా’ అంటూ బెదిరించారు. ప్రభుత్వంలో ఉన్నామని, క్యాంపులో ఉన్నవారు బయటకు రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే చిన్నయ్య టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమార్తెను హెచ్చరించారు. వీరి సంభాషణలకు సంబంధించిన ఆడియో వైరల్ అయింది. పైగా ఈ ఆడియోలో రెండు, మూడు చోట్ల మంత్రి కెటిఆర్ పేరు ప్రస్తావించారు. క్యామ్ పు లో ఉన్న మరో మహిళా కౌన్సిలర్ గురించి మాట్లాడుతూ ఆమె భర్త ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తారని కేటీఆర్ తలచుకుంటే ఆమె భర్త ను మణుగూరుకు బదిలీ అవుతుందని కూడా చిన్నయ్య హెచ్చరించారు. అధునాతన మొబైల్ ఫోన్లు వచ్చాయని, బెదింపులకు పాల్పడితే రికార్డు చేయవచ్చునని శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎందుకు మరిచిపోతుంటారో ! తెలియదు. పైగా సామాజిక మాథ్యమాలు క్రియాశీలంగా పనిచేస్తున్నందున ఆడియో, వీడియోలు వైరల్ అయితే పార్టీకి, కేసీఆర్ కు మచ్చ వస్తుందని ఎందుకు భయపడరో! అంతుచిక్కని విషయం. అధికారంలో ఉన్నపుడుఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనుకోవడం భ్రమ.