అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు.

న్యూ ఢిల్లీ:
వచ్చే నెలలో జరిగే వర్షాకాల సమావేశాలే ఈ పార్లమెంటుకి చివరి సమావేశాలా? వచ్చే ఏడాది మేలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నాయా? ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సిద్ధమవుతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినపుడు ఈ ఏడాది చివరి వరకు ఆగకుండా అక్టోబర్‌లోనే నిర్వహిస్తే మంచిదనేది బీజేపీలో మెజారిటీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇటీవల కొందరు కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ ఏడాది చివరకు గడువు తీరనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాంలతోపాటు ఆ తర్వాత 6-10 నెలల లోపు గడువు మిగిలిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్ శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు డ్రాఫ్ట్‌ బిల్లులు సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. నిజానికి 2019 ఏప్రిల్-మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగాలి. కానీ నాలుగైదు నెలల ముందుగానే ఎన్నికలు పెడితే మంచిదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. తమ విభేదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొని ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. కొంత కాలంగా ప్రధాని లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణ గురించి తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో కూడా మోడీ జమిలి ఎన్నికల అంశంపై చర్చించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరపాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా ఫర్వాలేదనేది బీజేపీ వర్గాల మాట. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌- మేలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు తమంతట తాము రద్దు చేస్తే తప్ప అక్కడి అసెంబ్లీలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే ఆలోచనే తలెత్తదు.
కర్ణాటక, ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి తమకే అధికారం దక్కుతుందనే ధీమా కమలం పార్టీలో వ్యక్తమవుతోంది. జూలై 18 నుంచి ఆగస్ట్ 10 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ముందస్తు ఎన్నికలపై మోడీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ సీనియర్‌ నేతలు ఓ అంతర్గత సదస్సును నిర్వహించి ఎన్నికలపై అభిప్రాయసేకరణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత మిత్రపక్షాలతో కూడా సమావేశమై ముందస్తు ఎన్నికల గురించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. ఆగస్టులో మోడీ సర్కార్‌ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఎన్నికల సంఘం సెప్టెంబరులోనే ఎన్నికల షెడ్యూలు, ఆ తరువాత నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.