అటు జోష్‌, ఇటు అసమ్మతి. పాలమూరులో ‘వలసల’ చిచ్చు. టిఆర్ఎస్, కాగ్రెస్- సేమ్ టు సేమ్.

ఎస్.కె. జకీర్.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పార్టీ బలోపేతంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీడీపీలు బలంగా ఉండడం, బీజేపీ కూడా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కలిగిన నేపథ్యంలోకేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జైపాల్‌రెడ్డి, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి వంటి బలమైన ప్రతిపక్ష నేతలు ఈ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడ పార్టీ బలోపేతంపై టీఆరెస్ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో అమలు చేసిన వ్యూహం మొదలుకొని ఇటీవల మాజీ ఎమ్మెల్యేలు అబ్రహం, ఎడ్మ కిష్టారెడ్డిని చేర్చుకునే వరకు టీఆర్‌ఎస్‌ దూకుడు వైఖరినే కొనసాగించింది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పార్టీలో చేర్చుకునే క్రమంలో స్థానిక నాయ కత్వం అయిష్టతను, అసంతృప్తిని ఖాతరు చేయలేదు. అసమ్మతి ఆయకుల్, క్యాడర్ ను సర్ధిచెబుతూ కొత్తవారిని చేర్చుకుంటోంది. కానీ అధికార పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జాడలు విప్పుతున్నది.
నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలుపొందిన రాజేందర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న తర్వాత అక్కడ పాత టీఆర్‌ఎస్‌ వర్గానికి, రాజేందర్‌రెడ్డితో చేరిన వర్గానికి మధ్య పొసగడం లేదు. ఎప్పటికప్పుడు దీన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శివకుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. మక్తల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ గతంలో టీఆర్‌ఎస్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించిన దేవరమల్లప్పకు గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ స్వయంగా ఎమ్మెల్సీ గానీ, ఏదైనా నామినేటెడ్‌ పదవి ఇస్తారని హామీ ఇచ్చినా నెరవేరకపోవడంతో ఆయన వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఇటీవల రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ పదవిని మల్లప్ప ఆశించారు. కానీ దక్కకపోవడంతో లోలోన రగిలిపోతున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. అదే ఒరవడిలో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రాధా అమర్‌ను, నారాయణపేటలో బీజేపీకి చెందిన చైర్‌పర్సన్‌ అనసూయతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలకు చెందిన కౌన్సిలర్లను ఇటీవల టిఆర్ ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి పి. రాములును టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసి, సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న రాములు టీఆ ర్‌ఎస్‌లో చేరడంతో ఆ నియోజకవర్గ రాజకీయ సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాములుకు ఎంపీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ పోటీకి కేసీఆర్‌ అవకాశం కల్పిస్తారని అతని అనుచరులు పేర్కొంటున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో టీఆర్‌ఎస్‌ ఆరు వర్గాలుగా ముక్కలైంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి బాలాజీసింగ్‌, మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ ద్యాప విజితారెడ్డితో పాటు గోళి శ్రీనివాస్‌రెడ్డి గ్రూపులు పని చేస్తుండగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డిని పార్టీలో చేర్చుకోవ డంపై విస్మయం వ్యక్తమౌతోంది. ఎడ్మకిష్టారెడ్డి చేరిక సందర్భంలో జిల్లా మంత్రులు హైదరాబాద్‌లో నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. టిక్కెట్‌ విషయాన్ని కేసీఆర్‌కు వదిలేసి, అందరూ ఐక్యంగా పనిచేయాలన్నది టిఆర్ ఎస్ ముఖ్యుల సూచన. ఎవరి కివారు తమ టికెట్టు కోసం గోసను వెలిబుచ్చారు. కానీ ‘ఎడ్మ’ను చేర్చుకునే విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని మార్చలేకపోయారు.నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినపుడు అదే పార్టీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. దీంతో దామోదర రెడ్డిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అక్కడి ఎమ్మెల్యేతో కలిసి మంత్రి హరీశ్‌రావు నడిపిన మంత్రాంగం ఫలించింది. అలంపూర్‌ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌లో కొత్త నేతల చేరికల వ్యవహారం పార్టీలో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. గత ఎన్నికల్లో మాజీ ఎంపీ డాక్టర్‌ మందా జగన్నాథ్‌ తనయుడు శ్రీనాథ్‌ పోటీ చేశారు. అలంపూర్‌లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్‌ఎస్‌ని గెలిపించాలనే పట్టుదలతో ఉన్న అధిష్టానం ఇటీవల టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అబ్రహంను పార్టీలో చేర్చుకుంది. అబ్రహం చేరికపై ‘మందా’ నుంచి వ్యతిరేకత రాకుండా ఆయన్ను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అయినా అబ్రహం వర్గీయుల కార్యకలాపాలపై మాజీ ఎం.పి. డాక్టర్ జగన్నాథం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గ్రూపు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు తగిన ప్రాధాన్యత ఇస్తానన్న కేసీఆర్‌ హామీ నిలబెట్టుకోలేదని ‘గట్టు ‘ అనుచరుల్లో నిరసన వ్యక్తమవుతున్నది. టీడీపీ నుంచి వచ్చిన ఆంజనేయగౌడ్‌కు బీసీ కమిషన్‌ సభ్యుడిగా అవకాశమిచ్చారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకు ఎలాంటి న్యాయం చేయలేదనే అసంతృప్తి గట్టు సోదరుల్లో నెలకొంది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారు. స్థానికంగా ‘నాగం’పై మూడు దశాబ్థాలు పోరాడిన తమకు కనీస సమాచారం ఇవ్వలేదని, ఏకపక్షంగా అతన్ని ఎలా చేర్చుకుంటారనే కినుకతో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి జంపు చేశారు. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి బహిరంగంగా ‘ఆఫర్‌’ ఇవ్వడం కాంగ్రెస్‌లో మరోవర్గానికి కంటగింపుగా మారింది. ఇతర పార్టీల నాయకుల చేరికల పట్ల కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంటే, పార్టీ నాయకుల్లో మాత్రం కొంత నిర్వేదం కనిపిస్తోంది. కష్టనష్టాలకొర్చి పార్టీని అంటిపెట్టుకొని ఉంటే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పొత్తుల పేరుతోనో, లేకపోతే బలమైన నాయకులనో భ్రమ కల్పించి టిక్కెట్లు ‘తన్నుకుపోవడం’ సమంజసం కాదన్న వాదన కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి వస్తోంది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ కంటే ప్రతిపక్ష కాంగ్రెస్‌లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టిసారించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రెండేళ్లుగా స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బలమైన నాయకులను, శ్రేణులను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు చాపకిందనీరులా కార్యాచరణ అమలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై పట్టుని బిగించే క్రమంలో మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో తన బలం, బలగాన్ని విస్తరించేందుకు ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తెస్తున్నారు. ఇరువురు నేతలు ఎవరికి వారు తమ ద్వారా పార్టీలోకి వచ్చేవారికి ప్రాధాన్యం ఇప్పించే క్రమంలో వర్గవిభేదాలు పొడసూపుతున్న పరిస్థితి నెలకొంది. చేరికలు, వలసలతో పార్టీ బలపడాల్సిన పరిస్థితిలో కొత్త, పాత నేతల మధ్య, జైపాల్‌, అరుణ వర్గాల మధ్య కీచులాటలతో ఇబ్బందికర పరిణామాలు నెలకొంటున్నాయి. దీనిపై అధిష్టానం దృష్టిసారించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన కీలక నేతలు, యువ నేతలు సైతం టిక్కెట్‌ హామీతో కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తుండడం రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ఇక్కడ కాంగ్రెస్‌ బలంగా ఉందనే సంకేతాలనిస్తోంది.కొడంగల్‌ ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన ‘ఫైర్ బ్రాన్ద్ ‘ ఏ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికల పర్వం మొదలయ్యింది. మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గానికి చెందిన యువనేత, హన్వాడ జడ్పీటీసీ నారాయణమ్మ తనయుడు సురేందర్‌రెడ్డి తన అనుచరులతో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఎన్‌పీ వెంకటేశ్‌ హస్తం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా, అంతకుముందు రెండు సార్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి బలమైన వర్గాన్ని కలిగిన సయ్యద్‌ ఇబ్రహీం కూడా కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నారని, టిక్కెట్‌ హామీ ఇస్తే పార్టీలోకి వస్తారనే చర్చ సాగుతోంది. ఇబ్రహీంను కాంగ్రెస్‌లో చేర్చుకొని టిక్కెట్టిస్తే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించ వచ్చని జైపాల్‌వర్గం చెబుతున్నది. మరో వైపు టీడీపీకి చెందిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎం. చంద్రశేఖర్‌ని పార్టీలోకి తీసుకువచ్చి, మహబూబ్‌ నగర్‌ లేదా జడ్చర్ల నుంచి పోటీ చేయించాలని డీకే అరుణ వర్గం కోరుతున్నది. అలా చేయడం వల్ల ఈ నియోజ కవర్గాలతో పాటు నారాయణపేటలోనూ పార్టీకి బీసీ వర్గాల్లో ఆదరణ పెరుగుతుం దని, పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యాప్తం గా పార్టీకి ప్లస్‌ అవుతుందని డి.కె అరుణ వాదన. నారాయణపేటలో గత ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయిన శివకు మార్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని డీకే అరుణ వర్గం భావిస్తున్నది. అక్కడ గత ఎన్నికల్లో పోటీచేసిన సరాఫ్‌ కృష్ణ తదితరులు జైపాల్‌రెడ్డితో కలిసి అడ్డుకుంటున్నట్లు శ్రేణుల్లో చర్చ సాగుతోంది. కె.శివకుమార్‌రెడ్డి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్‌ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనా అధిష్టానం ఎందుకు తాత్సారం చేస్తుందని డీకే అరుణ ఇటీవల నిర్వ హించిన పీసీసీ సమావేశంలో తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు.