అటు ‘ముందస్తు’ ఇటు ‘మొక్కు’. ‘పాలపిట్ట’ సంకేతం.

పాలపిట్టకు  తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారు. లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని గతంలో ఒకసారి కేసీఆర్ వివరించారు.

ఎస్.కె.జకీర్.
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వచ్చినా,రాకపోయినా తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ మేరకు టీఆరెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రకటనలు చేస్తున్నారు. స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. గురువారం విజయవాడలో కనకదుర్గమ్మకు ‘మొక్కు’తీర్చుకోవడం విశేషం కాదు. మొక్కు కోసం తయారు చేయించిన ‘ముక్కుపుడక’ లో తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ‘పాలపిట్ట’ ఉండడం విశేషం. మంచి శకునానికి ‘పాలపిట్ట’ సింబల్ గా ఉన్నది. కనుక ‘ముందస్తు’ఎన్నికలకు ఇంద్రకీలాద్రి నుంచే కేసీఆర్ సన్నాహాలు ప్రారంభించినట్టు అర్ధమవుతుంది. ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ వుంటారు. ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు ‘మంచి శకునం’ ఎదురుగా రావాలని ఆశిస్తూ వుంటారు. తలపెట్టిన కార్యాన్ని ఎదురుగా వచ్చే శకునం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుందనే విశ్వాసం పూర్వకాలం నుంచీ వుంది. ఈ శకునాలలో మనుషులు మాత్రమే కాకుండా కొన్ని జంతువులు, పక్షులు కూడా పేర్కొనబడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ధ్వనులను కూడా శకునాలుగా భావిస్తూ ఉంటారు. ముత్తయిదువులు నీళ్ల బిందెతో ఎదురైనా, ఆవుదూడలు ఎదురైనా, ఆలయంలో నుంచి గంట మోగిన శబ్దం వినిపించినా శుభశకునాలుగా భావించాలని చెబుతుంటారు. అలాగే ‘పాలపిట్ట శకునం’ కూడా శుభసూచకంగా విశ్వసిస్తారు. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం నిమిత్తం ప్రయాణమైనప్పుడు ఎదురుగా పాలపిట్ట వస్తే అది ‘శుభసూచకంగా’ భావిస్తుంటారూ. తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ఈ కారణంగానే విజయదశమి రోజున ‘జమ్మిపూజ’ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం తరతరాలుగా వస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోని వారు జమ్మిపూజ అనంతరం పాలపిట్ట దర్శనానికి బయలుదేరుతారు. పాలపిట్ట కనిపించిన తరువాతనే వెనుదిరుగుతారు. ఈ రోజున పాలపిట్టను చూడటం వలన ఏడాదిపాటు ఏ కార్యాన్ని ఆరంభించినా అది సఫలీక తమవుతుందని విశ్వసిస్తుంటారు. ఇలా ‘పాలపిట్ట శకునం’ వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, విజయం చేకూరుతుందన్న విశ్వాసం ఉన్నది. రాష్ట్ర జంతువుగా జింక , రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు ఉన్నవి. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, అలవాట్లకు అద్దంపడుతూ, చరిత్ర, పౌరాణిక నేపథ్యం ఉన్న వాటిని చిహ్నాలను కేసీఆర్ గతంలో ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఉన్న అధికారిక చిహ్నాలు ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారు. జింకకు భారతదేశంలో ప్రముఖ స్థానం ఉంది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను ఎంపిక చేశారు. పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారు.లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని గతంలో ఒకసారి కేసీఆర్ వివరించారు. రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసినప్పుడు సీఎం ప్రకటించారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగం. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారు. తర్వాత వాటితోనే కౌరవులను ఓడించారు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుంది. ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారు.