అమెరికాలో ఊడనున్న లక్ష ఉద్యోగాలు. సొంతూరు బాట తప్పని తెలుగు యువత.

వాషింగ్టన్:
ఇప్పటికే హెచ్‌-1బీ వీసాల కఠినతర నియమ, నిబంధనలతో తంటాలు పడుతున్న ఉద్యోగులకు ఇప్పుడో షాకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానాలతో లక్ష ఉద్యోగాలకు ఎసరొచ్చి పడేలా ఉంది. హెచ్‌1-బీ వీసాపై వచ్చినవారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేయడాన్ని నిషేధించ ఆలోచనలో ఉంది ట్రంప్‌ ప్రభుత్వం. దీంతో సుమారు లక్ష మంది కొలువులు ప్రమాదంలో పడ్డాయి. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చిన సంస్థలకు కూడా ఇది గట్టి దెబ్బే కానుందని ఓ కొత్త రీసెర్చి పరిశీలన తెలిపింది. హైస్కిల్డ్ ఉద్యోగులకిచ్చే హెచ్‌-1బీ వీసాల జారీ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసింది. ఇప్పుడు ఈ వీసా కలిగిన ఉద్యోగుల జీవిత భాగస్వాములు అక్కడ ఉద్యోగం చేయకుండా నిషేధించనుంది. హెచ్‌-1బీవీసా కలిగినవారి భాగస్వాములు ఉద్యోగాలు చేస్తున్నందువల్ల స్థానికంగా నిరుద్యోగం పెరిగిపోతుందంటున్న అమెరికా ప్రభుత్వం.. వీరిపై నిషేధం విధించనున్నట్టు సమాచారం. దీనివల్ల హెచ్‌-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే వారిలో ఒకరే ఉద్యోగం చేయాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని లిమెరిక్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలో తెలిసింది. ఈ నిషేధం వల్ల విదేశాల్లో ఒకరే ఉండాల్సి రావడంతో కుటుంబ సమస్యలు తలెత్తవచ్చని అంటున్నారు. కుటుంబాన్ని విడిచి ఉండాల్సి రావడంతో వీసాదారులు ఎక్కువ కాలం ఉద్యోగంలో కొనసాగడం లేదు. పనితనంపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. దీనివల్ల దాదాపు లక్షమంది తమ ఉద్యోగాలను వదులుకొని సొంతూరి బాట పట్టాల్సి వస్తోంది. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేయవచ్చని గతంలో ఒబామా ప్రభుత్వం అనుమతించింది. దీని వల్ల స్థానికులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించడం లేదన్నది ట్రంప్‌ ప్రభుత్వం వాదన. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి బహుళ జాతి దిగ్గజ కంపెనీలకు ఇది పెద్ద సమస్యగా మారనుంది.