అమెరికాలో వ్యక్తి స్వేచ్ఛ కు ముప్పు! నోటికి ‘టేపు’తో తాళం.

వాషింగ్టన్:
వ్యక్తి స్వేచ్ఛకి పెద్ద పీట వేస్తారని పేరున్న అమెరికాలో దారుణం జరిగింది. కోర్టులో కేసు విచారణ సందర్భంగా నిందితుడి నోరు నొక్కేశారు పోలీసులు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్ ల్యాండ్ లో ఈ అమానుషం చోటు చేసుకుంది. సాక్షాత్తూ జడ్జి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు కోర్టు గదిలో నోటికి టేప్ వేసి నోరు మూయించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ వీడియోని సంపాదించి అగ్రరాజ్యంలో మానవ హక్కుల హనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.ఫ్రాంక్లిన్ విలియమ్స్(32) ఓ కేసులో నిందితుడు. ఈ కేసు విచారణ సందర్భంగా అతను తన వాదన వినిపించేందుకు పదేపదే మాట్లాడబోయాడు. జడ్జి జాన్ రూసో అతనిని నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించారు. ముందు విలియమ్స్ తరఫు న్యాయవాదుల వాదన విని ఆ తర్వాత అతని వాదన వింటానని చెప్పారు. దీంతో విలియమ్స్ నా ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. జరిగిందేంటో నన్ను చెప్పనివ్వట్లేదని వాదించబోయాడు.
అయినప్పటికీ అతను మాట్లాడేందుకు ప్రయత్నించడంతో జడ్జి రూసో విలియమ్స్ పై మండిపడ్డారు. అతనిని మందలిస్తూ ‘నేను మాట్లాడమన్నపుడు నోరు తెరువు. అప్పటి వరకు నోర్మూసుకో‘ అని కటువుగా హెచ్చరించారు. ఆ తర్వాత వాదనలు పూర్తయ్యే వరకు నోరెత్తకుండా విలియమ్స్ నోటికి ప్లాస్టర్ వేయాలని అధికారులను జడ్జి ఆదేశించారు. ఆరుగులు పోలీసులు వచ్చి లేవబోతున్న విలియమ్స్ ను పట్టుకొని అతని నోటిపై ఎర్రటి టేపు అతికించారు.
ఈ వీడియో చూసిన అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ ఓహియో మండిపడింది. జడ్జి చర్యలు నిందితుడిని కించపరిచేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. దీనిపై వ్యాఖ్యానించేందుకు జడ్జి రూసో నిరాకరించారు. అయితే న్యాయవ్యవస్థ అంటే గౌరవం లేకుండా విలియమ్స్ ప్రవర్తించినందువల్ల తను అలా ఆదేశించక తప్పలేదని తన చర్యలను సమర్థించుకున్నారు.