అమ్మకానికి 10 టి.వి!!

ఎస్.కె. జకీర్.

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ 10 టి.వి ని అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు 30 కోట్ల రూపాయల విలువతో అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. ఈ మేరకు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తతో ‘ బేరసారాలు’ సాగుతున్నట్టు తెలియవచ్చింది. ఆ పారిశ్రామికవేత్త గతంలో ‘ మా’ టివి యాజమాన్యంలో భాగస్వామిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇంకా బేరసారాలు పూర్తి కాలేదు.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఛానల్ ప్రసారాలు 2013 మార్చి లో ప్రారంభించారు. సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 10 టి.వి.ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. శాసనమండలి మాజీ సభ్యుడు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ 10 టి.వి.ఛానల్ కు తొలి చైర్మన్ గా పనిచేశారు. సిపిఎం సానుభూతిపరుడిగా ఉన్న నాగేశ్వర్ ఈ న్యూస్ ఛానల్ నిర్వహణ బాధ్యతలు కొన్నాళ్ళు చూశారు.ప్రస్తుతం ఎల్.ఐ.సి. లో అఖిలభారత సి.ఐ.టి.యు.కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన వేణుగోపాల్ 10 టి.వి. ఎం.డి. గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడొకరు న్యూస్ ఛానల్ లో వార్తా ప్రసారాలలో పార్టీ పాలసీ ని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ఛానల్ ‘ స్పూర్తి కమ్యూనికేషన్స్’ పేరిట రిజిస్టర్ అయింది.అయితే పార్టీ పేరుతో ఈ సంస్థ నమోదయిందా లేక ఎవరైనా వ్యక్తుల పేరిట ఉన్నదా?అనే అంశంపై స్పష్టత లేదు. కానీ ప్రజల సొమ్ముతో ,వారిని ‘ వాటాదారులుగా’ పేర్కొంటూ న్యూస్ ఛానల్ ప్రారంభించినపుడు సంబంధిత ‘షేర్ హోల్డర్ ‘కు సమాచారం లేకుండా అమ్మకానికి పూనుకోవచ్చునా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. నిజానికి ఈ ఛానల్ లో పనిచేస్తున్న సిబ్బంది లో ఎక్కువమంది మార్క్సిస్టు పార్టీ అభిమానులు,కార్యకర్తలు ఉన్నారు. ఎం.డి. గా పనిచేస్తున్న వేణుగోపాల్ వంటి వారు ఎలాంటి వేతనం తీసుకోవడం లేదని తెలియవచ్చింది. పార్టీ పట్ల అభిమానంతో ‘పూర్తి కాలపు’ కార్యకర్తల వలె మరికొందరు పనిచేస్తున్నట్టు సమాచారం ఉన్నది. జిల్లాల్లో రిపోర్టర్ల జీతం నెలకు పది,పన్నెండు వేల రూపాయలకు మించి ఇవ్వడం లేదు.టి.వి. 9, ఎన్.టి.వి.,టి.వి.5, సాక్షి వంటి ఛానళ్లతో పోల్చితే నెలవారీ నిర్వహణ వ్యయం కూడా తక్కువ. నిర్వహణ వ్యయం కన్నా వాణిజ్యప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయం ఈ ఛానల్ కు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.నష్టాల్లో లేకపోయినా,అప్పుల్లో కూరుకోకపోయినా 10 టి.వి.ని ఎందుకు అమ్మవలసి వస్తున్నది?అనే ప్రశ్నకు జవాబు రావలసి ఉన్నది. సార్వత్రిక ఎన్నికల ముంగిట 10 టి.వి.యాజమాన్యం, సిపిఎం పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నవి.

‘It is first cooperative news channel with more than 150000 share holders which includes agricultural workers, daily wage workers, workers from the unorganised sector, Industrial workers, teachers and middle class organisations in India. This is the first ever initiative of its kind in the world’.

అని వికీపీడియాలో 10 టి.వి. గురించి గొప్పగా రాసి ఉంటుంది. లక్షా యాభై వేలమందికి పైగా వివిధ వృత్తులు,రంగాలకు చెందిన కార్మికులు,కూలీలు,ఉద్యోగులు,మధ్యతరగతి ప్రజల నుంచి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారు. ఈ ‘వసూళ్లు’ వందల కోట్లలో జరిగినట్టు అప్పట్లో ఊహాగానాలు సాగాయి. ప్రజలనుంచి చందాల వసూళ్లకు గాను ‘డబ్బు పెట్టిన వ్యక్తులంతా వాటాదారులు’ అని కరపత్రాలు పంచారు. ‘ ప్రత్యామ్నాయ మీడియా’ అని ఆ కరపత్రాల్లో ఉద్వేగాన్ని రంగరించి ఆకట్టుకున్నారు. ‘ప్రజలే వార్తలు’ అనేది 10 టి.వి న్యూస్ ఛానల్ ‘ట్యాగు లైను’ . ఇండియాలో ‘ సహకార రంగంలో ‘వస్తున్న మొట్ట మొదటి న్యూస్ ఛానల్ గా తొలి నాళ్లలో ప్రచారం చేశారు.ప్రజలపక్షాన నిలబడిన న్యూస్ ఛానల్ గా గుర్తింపు పొందడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ దళితులు, మైనారిటీలు,బడుగు, బలహీన వర్గాలపై దాడులు, అణచివేత,అత్యాచారాల ఘటనలు జరిగినా మిగతా న్యూస్ చానళ్ల కన్నా పోటీగా, అందరికన్నా భిన్నంగా వార్తలు ప్రసారం చేస్తూ వస్తున్నదన్న పేరు 10 టి.వి. సంపాదించింది. తెలంగాణలో మల్లన్న సాగర్ తదితర ఇరిగేషన్ ప్రాజెక్ల్టుల కు వ్యతిరేకంగా ఈ న్యూస్ ఛానల్ కొంతకాలం ఇంచుమించు ‘ఉద్యమమే’ నడిపింది. అయితే గత కొన్ని నెలలుగా 10 టి.వి. ప్రసారాల పంథాలో మార్పు కనిపిస్తున్నట్టు తెలియవచ్చింది. ఏది ఏమైనా 10 టి.వి.న్యూస్ ఛానల్ అమ్మకానికి పెట్టారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించబోతున్నది. ఇందులో ఉన్న ‘వాటాదారులైన’ ప్రజలలో కొందరు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు తెలియవచ్చింది.