అయితే ‘చెయ్యి’, లేదా ‘పువ్వు’. కోమటిరెడ్డి శాస్త్రం.

ఎస్.కె.జకీర్.
‘నాకు టిపిసిసి అధ్యక్ష పదవి నివ్వండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తా’. అని మాజీ మంత్రి, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దీ రోజులక్రితమే అన్నారు. నిజమే కావచ్చు. ఆయన సమర్ధత మీద ఆయనకు నమ్మకం ఉన్నది. పార్టీ అధిష్టానం దాన్ని గుర్తించాలని చాలా రోజులుగా కోరుతున్నారు. రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోలేకపోతున్నందుకు మరో వైపు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకంగా నల్లగొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ది చెరగని ముద్ర. వ తమదైన శైలిలో దూసుకుపోతూ జనంలో మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అదే సమయంలో సొంత పార్టీలో “రెబల్” గా పేరు మోస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచారు. మంత్రి పదవి కూడా నిర్వహించారు. కేవలం తమ నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా మొత్తం వివిధ సందర్భాలలో పర్యటనలు చేయడం వల్ల ప్రతి నియోజకవర్గంలో కొంత కేడర్ ను సంపాదించుకున్నారు. మరికొన్ని జిల్లాల్లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఫాలోయింగ్ ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానుల మాట.
కోమటిరెడ్డి బ్రదర్స్ తమ రాజకీయ భవిష్యత్ పై కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నవి. ఓ వైపు సొంత పార్టీలో పీసీసీ పీఠం కోసం ప్రయత్నిస్తూనే, మరో వైపు బిజెపి నాయకులతోనూ మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గత కొన్నాళ్లుగా కోమటిరెడ్డిభ్రదర్స్ పీసీసీ పీఠం పై కన్నేశారు. అన్ని కలిసొస్తే ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కించుకోవలన్న వ్యూహంతో వారు ముందుకు పోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు అసలు ఎదురు లేదనే చెప్పవచ్చు. వై.ఎస్. మరణానంతరం అధిష్టానం దగ్గర గతంలో ఉన్న హవా తగ్గింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినందున దాని ప్రభావం కూడా కనిపిస్తున్నది. రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న కుంతియాకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కి అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉంది. ఆ నేపథ్యంలోనే కుంతియా పై, ఇటు ఉత్తమ్ పైన కోమటిరెడ్డి బ్రదర్స్ తరచూ ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఉత్తమ్ ను పీసీసీ అధ్యక్షుడుగా, కుంతియా ను పార్టీ ఇంఛార్జిగా గుర్తించబోమంటూ వారు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు .ఇటీవల కొంతకాలం మౌనం పాటించిన ‘బ్రదర్స్’ మళ్ళీ దూకుడు పెంచినట్లు కనపడుతుంది. పార్టీలో సీనియర్ల మధ్య ఏర్పడ్డ ‘అంతర్గత వార్’ ను తమను అనుకూలంగా మార్చుకునేందుకు వారు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే పార్టీలో టిపిసిసి అధ్యక్షునికి వ్యతిరేకంగా ఉన్నవారంతా ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు రాహుల్ ను కూడా కలిశారు. ఈ సారి ఏది ఏమైనా తమకు కీలక పదవి దక్కాల్సిందేనన్న కసితో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు . తమకు ఆ ‘కీలక పదవి’ ఇస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అధిష్టానానికి రాయబారం పంపారు . అందుకు అయ్యే ఖర్చు కూడా తామే భ రిస్తామని చెప్పారు. ఇది కాంగ్రెస్ కోణమే. మరోవైపు వారి చూపు బీజేపీ ఉందని కూడా తెలుస్తుంది. వెంకట్ రెడ్డి తో బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే పలు సార్లు మంతనాలు జరిపినట్లు సమాచారం.వెంకట్ రెడ్డి వస్తే ఆయనను నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలన్న వ్యూహంతో బిజెపి అగ్రనాయకత్వం ఉన్నట్టు తెలియవచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన సైతం చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తున్నది. బీజేపీ విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలియవచ్చింది. రానున్న ఒకటి, రెండు నెలల్లోపే రాజకీయ భవిష్యత్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ కీలక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తున్నది.