అయోధ్య ఉగ్ర దాడి: నలుగురికి జీవిత ఖైదు

అయోధ్య ఉగ్ర దాడి: నలుగురికి జీవిత ఖైదు

2005లో అయోధ్యలో జరిగిన ఉగ్రవాద దాడి కేసులో ప్రయాగరాజ్ ప్రత్యేక న్యాయస్థానం నలుగురు దోషులకు జీవితఖైదు శిక్ష విధించింది. కోర్టు ఒక నిందితుడిని విడుదల చేసింది. జూలై 5, 2005న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు మరణించారు. 2005లో రామజన్మభూమి పరిసరాల్లో ఉగ్రవాద దాడి జరిగింది. ఇందులో నిందితులపై ఇవాళ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ప్రయాగరాజ్ లోని నైనీ సెంట్రల్ జైల్ లో ఇవ్వడం జరిగింది. ఈ కేసును స్పెషల్ జడ్జి ఎస్సీ/ఎస్టీ దినేష్ చంద్ర విచారించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు చాలా కాలంగా నైనీ సెంట్రల్ జైల్లో బందీలుగా ఉన్నారు.

జూలై 5, 2005న జరగిన ఉగ్ర దాడిలో ఇద్దరు మరణించగా కొందరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు డాక్టర్ ఇర్ఫాన్, మొహమ్మద్ షకీల్, మొహమ్మద్ నసీమ్, మొహమ్మద్ అజీజ్, ఫారుఖ్ జైల్లో బందీలుగా ఉన్నారు. తీర్పు తర్వాత అయోధ్య, నైనీ జైల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత 14 ఏళ్లుగా కేసు విచారణ, ట్రయల్ సాగుతోంది. ఒక సుదీర్ఘ విచారణ అనంతరం జడ్జి 18 జూన్ న తీర్పు ఇచ్చారు. దర్యాప్తు సందర్భంగా పోలీసులు.. కుట్ర రచించడం, ఉగ్రవాదులకు సహాయం చేశారన్న అరోపణలపై ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులను అప్పుడే హతమార్చారు. పధ్నాలుగేళ్ల విచారణలో మొత్తం 63 మందిని విచారించారు. ఎన్నోసార్లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిగింది.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు కాంప్లెక్స్ జూలై 5, 2005న కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. కానీ లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాదులు దీనిని లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు నేపాల్ ద్వారా భారత్ లో చొరబడ్డారు. భద్రతా ఏజెన్సీ కేవలం ఒక్క గంటలోనే ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భక్తుల వేషంలో ఉగ్రవాదులు అయోధ్యలోకి ప్రవేశించారు. ఆ పరిసరాలలో రెక్కీ నిర్వహించారు. టాటా సుమోలో ప్రయాణించారు. దాడికి ముందు వాళ్లు రామ మందిరం దర్శించారు. రామజన్మభూమి పరిసరాల్లోకి వాహనంలో ఎక్కి వచ్చిన ఉగ్రవాదులు, భద్రతా వలయాన్ని ఛేదిస్తూ దూసుకొచ్చి గ్రనేడ్లు విసిరారు.