అర్ధరాత్రి ఏటీఎం లు ఉండవు.

హైదరాబాద్:
రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు… ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేయడం కష్టమే… మీరు అంతగా జనసంచారంలేని ప్రాంతంలో ఉంటే… జనసంచారం ఎక్కువగా ఉన్న మరో సెంటర్‌లోని ఏటీఎంకు పరుగుపెట్టాల్సిన పరిస్థితి రానుంది. ఉదయం 5 గంటల లోపు 5 కన్నా తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలు మూసివేయనున్నారు. పోలీసులతో సమావేశమైన సైబరాబాద్ బ్యాంకర్లు రాత్రి 11 గంటల తరువాత జనసంచారం లేని ప్రాంతాల్లో ఏటీఎంలను మూసివేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 24 గంటల పాటు ఏటీఎంలు నిర్వహిస్తుండడంతో నిర్వహణా భారం పెరగడం, తక్కువ లావాదేవీలు జరుగుతుండడంతో రాత్రి వేళల్లో నిరుపయోగంగా ఉన్న ఏటీఎం సెంటర్లను డీలింక్ చేయాలని పోలీస్ కమిషనరేట్ లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో పోలీసులు చేసిన సూచనకు బ్యాంకర్లు సమ్మతించారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధాన కార్యాలయాలు తీసుకుంటాయని, విషయాన్ని హెడ్డాఫీస్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరాలను నియంత్రించడానికి రాత్రి సమయంలో ఏటీఎంలను పూర్తిగా మూసివేయాలని పోలీసు అధికారులు సూచించారు. ఇక రాత్రిపూట 5 కన్నా తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలలో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉండడంతో వీటిపైనే క్లోనింగ్ ముఠాలు కన్నేశాయని, వీటిల్లో స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి కార్డుల వివరాలు తస్కరిస్తున్నాయని గుర్తుంచిన పోలీసులు… వీటిని మూసేస్తేనే మంచిదని నిర్ణయానికి వచ్చారు. మరి పోలీసులు అధికారుల సూచనలకు బ్యాంకర్లు ఆమోదం తెలిపితే త్వరలోనే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏటీఎంలు మూతబడడం ఖాయంగా కనిపిస్తోంది.