ఆభరణాలు చూపబోమన్న టిటిడి బోర్డు. వివాదాల సుడిగుండంలోనే టిటిడి.

తిరుపతి:
టీటీడీ బోర్డు మరోసారి యు-టర్న్ తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆభరణాల ప్రదర్శించడం కుదరదని ప్రకటించింది. అత్యంత పవిత్రమైన స్వామివారి ఆభరణాలను వెండి వాకిలి వెలుపలికి తీసుకురావడం ఆగమశాస్త్ర విరుద్ధమని చెబుతూ టీటీడీ ఆగమ సలహామండలి ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. వార్షిక తనిఖీలు, బ్రహ్మోత్సవాలకు ఆభరణాలు శుభ్రం చేయడం, మెరుగుపెట్టే పనులన్నీ స్వామివారి సన్నిధిలోనే జరుగుతాయని గుర్తు చేసింది. భక్తుల్లో కలుగుతున్న అనుమానాలు తీర్చేందుకు పాలక మండలి చేసిన తీర్మానాన్ని 24 గంటల్లోపే తిప్పికొట్టేసింది. అసలే ఈ వ్యవహారంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న సామాన్య భక్తుల్లో ఇది మరిన్ని అనుమానాలు పెంచుతోంది.
కొన్ని రోజులుగా టీటీడీ వివాదాల సుడిగుండంలో చిక్కుకొంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి రోజూ తరలివచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా బోర్డు వ్యవహార శైలిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా వదలకుండా రాజకీ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉండటంతో ఆలయ ప్రతిష్ఠకు తీరని భంగం కలుగుతోంది. ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులుకు ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ ప్రకటించడం అసలు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీక్షితులు వెంటనే ప్రభుత్వం, టీటీడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆలయంలో అవినీతి పెరిగిపోయిందని, శాస్త్ర విరుద్ధంగా పూజాదికాలు నిర్వహిస్తున్నారని పెద్ద దుమారమే రేపారు. వందల ఏళ్ల క్రితం స్వామివారికి కానుకగా వచ్చిన విలువైన బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు కొన్నేళ్లుగా కనిపించడం లేదని సంచలనం సృష్టించారు. ఆలయ పోటులో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని చెప్పి పెను ప్రకంపనలు కలిగించారు.
రమణ దీక్షితులు ఆరోపణలతో విపక్షాలు సైతం గొంతు తెలిపాయి. టీటీడీ, ప్రభుత్వ వ్యవహారశైలి పలు అనుమానాలకు తావిస్తోందని నేతలు ఆరోపించారు. ఆలయ విధివిధానాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న రమణ దీక్షితులుకి మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా మద్దతు తెలిపారు. అయితే ప్రభుత్వం, టీటీడీ ఆ ఆరోపణలు ఖండించాయి. జరుగుతున్న వ్యవహారాలు, రోజురోజుకీ పెరుగుతున్న ఆరోపణలు సామాన్య భక్తుల్లో అనుమానాలు పెరిగేలా చేశాయి. దీంతో శ్రీవారి ఆభరణాలను ప్రదర్శనకు పెడతామని బోర్డు ప్రకటించింది. కానీ చివరికి నాలుగంటే నాలుగే గంటల్లో మూడు విడతలుగా వెళ్లిన పాలకమండలి సభ్యులు, అధికారులు శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేశారు. మూడు విడతలుగా శ్రీవారి ఆలయంలోని జయవిజయుల గడప దాటాక ఉన్న రాములవారి మేడలో భద్రపరిచి ఉన్న ఆభరణాల లాకర్లను, తిరువాభరణాల రిజిస్టర్‌ తనిఖీ చేశారు. అయితే వేలకోట్లు విలువ చేసే స్వామివారి టన్నుల కొద్ది ఆభరణాలను కొన్ని గంటల వ్యవధిలో పాలకమండలి తనిఖీ చేసి అంతా భద్రం అని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా పాలకమండలి ఆభరణాలను చూశారా? లేక తనిఖీ చేశారా? అని సగటు భక్తులు ప్రశ్నిస్తున్నారు. 40వేల టన్నుల బంగారాన్ని అంత తక్కువ వ్యవధిలో పరిశీలించడం సాధ్యమేనా అనేది ప్రశ్న. సాధారణంగా కనీసం 15 రోజులకు పైగా పట్టే ఈ ప్రక్రియ ఇంత త్వరగా ముగించడంపై అనుమానాలు కలిగిస్తోంది.టన్నుల కొద్దీ బంగారాన్ని పరిశీలించలేదని, తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదైన ఆభరణాల జాబితాలోని కొన్నిటిని రాండమ్‌గా పరిశీలించామన్నారు పాలకమండలి సభ్యులు. 580, 180.. ఇలా సంఖ్యల ప్రకారం వివరాలు పొందుపరిచారని అన్నారు. 1952 నుంచి 1996లో మిరాశి వ్యవస్థ రద్దయ్యేంత వరకు శ్రీవారి ప్రతి ఆభరణం తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదైందని.. టీటీడీ పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా నగలను భద్రపరుస్తున్నారన్నారు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్. పెద్దలాకర్‌కు సంబంధించిన తాళాలు, రహస్య నెంబర్ విధానం, డిప్యూటీ ఈఓ స్థాయి అధికారి దగ్గర ఉంటాయన్నారు. అటు తరువాత లాకర్ కీ తెరవాలంటే అందుకు సంబంధించి లాకర్, రహస్య నెంబర్ ఏఈఓ స్థాయి అధికారి దగ్గర, ఈ రెండు ఉన్నా మరింత రహస్యమైన లాకర్‌కు సంబంధించిన సంఖ్య ఆలయ సూపరింటెండెంట్, అర్చకులకు మాత్రమే తెలిస్తుందన్నారు. ఆభరణాలు భద్రపరిచిన రాములవారి మేడలో అత్యంత అధునాతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నారన్నారు. గత 15 ఏళ్లనాటి సీసీ కెమెరాల రికార్డులు కూడా ఉన్నాయన్నారు. అన్న ప్రసాద పోటులో మరమ్మతులు జరిగిన మాట వాస్తవమేనన్నారు పాలకమండలి సభ్యులు. అయితే రమణ దీక్షితులు చెప్పినట్టుగా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరగలేదన్నారు. అన్నప్రసాదాలు తయారు చేసేటపుడు ఉష్ణతీవ్రతకు పురాతన గోడలు కొంత దెబ్బతిన్నాయని చెప్పారు. వాటిని అలాగే ఉంచి, వాటిపై ఫైర్ రిఫ్రాక్టరీ ఇటుకలు అమర్చినట్టు తెలిపారు. నాటి రాతి స్థంభాల కట్టడాలలో ఒక పిల్లర్ దెబ్బతినగా దానిని గుర్తించి అత్యంత పటిష్టమైన గ్రిడ్స్‌ను సపోర్ట్‌గా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పాతకట్టడాల్లో నేలపై తవ్వకాలు జరిగితే కుప్పకూలిపోతాయన్నారు. అలాంటప్పుడు తవ్వకాలు ఎలా చేస్తారని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు. ఈ పనులన్నీ అర్చక కమిటీ, ప్రధానార్చకుల పర్యవేక్షణలో జరిగిందన్నారు. పోటులో కూడా సర్వేలెన్స్‌లు ఉన్నాయన్నారు. ఇంత పటిష్టమైన భద్రత ఉండగా అక్కడ తవ్వకాలెలా జరుగుతాయని ప్రశ్నించారు. స్వామి ఆభరణాలను ప్రదర్శించాలనే నిర్ణయం తీసుకొనే ముందు టీటీడీ పాలక మండలి ఆగమశాస్త్ర సలహా మండలిని సంప్రదించలేదా? అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే ఏదైనా నిర్ణయం ప్రకటించే ముందు అందుకు అవసరమైన సలహా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోనీ ఆ ప్రకటన వచ్చిన వెంటనే ఆగమశాస్త్ర మండలి ఆ నిర్ణయాన్ని ఖండించే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా ముందు ప్రకటన.. తీరా సరిగ్గా ప్రదర్శించాల్సిన రోజు దగ్గరపడే ముందు వెనక్కి తగ్గడం చూస్తుంటే వద్దన్నా సందేహాలు ముసురుతున్నాయి. మరి ఈ కొండపై జరుగుతున్న గోల గోవిందాన్ని స్వామి ఎలా పరిష్కరిస్తాడనేది ఇప్పుడు వెలకట్టలేని రూబీ డైమండ్ అంత పెద్ద ప్రశ్న.