ఆమరణ దీక్ష చేస్తాం. రేషన్ డీలర్ల హెచ్చరిక.

హైదరాబాద్:
న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారానికి ఆమరణ దీక్ష చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సమ్మె విరమించేది లేదని రేషన్ డీలర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో తమని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం డీలర్లకు రావాల్సిన రూ.600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తే లారీలతో పాలు తెచ్చి సీఎం కేసీఆర్ ని అభిషేకిస్తామన్నారు. తమకు మద్దతుగా సమ్మెలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల డీలర్లు సిద్ధంగా ఉన్నారని రేషన్ డీలర్ల సంఘం నాయకుడు నాయకోటి రాజు తెలిపారు. తమ వెనుక ఆలిండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ తప్ప ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేశారు. జూలై 5లోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ చేపట్టేది జూలై 4న ప్రకటిస్తామని చెప్పారు.