‘ఆయనే విడాకులు అడిగారు”. – పవన్ మాజీ భార్య రేణూదేశాయ్.

హైదరాబాద్:
రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విడాకులు కోరారనే విషయాన్ని మాత్రం ఇద్దరూ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రేణు దేశాయ్ కి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ …” ఇంతకాలం చాలా ఇంటర్వ్యూస్ లో ఈ ప్రశ్న ఎదురైనా నేను ఎక్కడా సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ అయింది కనుక చెప్పవచ్చని అనుకుంటున్నాను. నేను ఏ ఇంటికైతే కోడలిగా వెళుతున్నానో వాళ్లు కూడా నన్ను ఈ ప్రశ్న అడిగారు. జరగనున్నది అరేంజ్డ్ మేరేజ్ కనుక .. ఈ విషయానికి సంబంధించి నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ వీడియోలను కూడా వాళ్లు చూశారు. ‘నీ తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచించడం?’ అని వాళ్లు నన్ను అడిగారు. అందుకే ఈ సారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. విడాకులు నేను అడగలేదు .. ఈ విషయం కల్యాణ్ గారికి తెలుసు .. దేవుడికి తెలుసు. విడాకులు కావాలని ఆయన అడిగారు .. నాకు కోపం వచ్చింది. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో .. అదే మా మధ్య జరిగింది. ఆయనకే విడాకులు కావాలి .. ఆయనే అడిగారు .. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది” అంటూ ఇబ్బంది పడ్డారు.ఇటీవలే రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన నిశ్చితార్థానికి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించారు. ” తెలియని వ్యక్తులు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్టుగా మా విషయంలో జరగలేదు .. ఒక రకంగా ఇది అరేంజ్డ్ మేరేజ్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ల ఫ్యామిలీతో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల ముందే వాళ్లు యూఎస్ నుంచి పూణె వచ్చారు. ఆయన కూడా డైవోర్స్ తీసుకున్నారు .. చాలా మంచి వ్యక్తి అని సన్నిహితులు చెప్పారు. నిజానికి నేను మళ్లీ పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అలాంటప్పుడు మా బంధువులు .. స్నేహితులు నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జీవితంలో నీకంటూ ఒక తోడు కావాలి ఆయన చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పారు. ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించి పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు.