ఆర్నెల్ల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

న్యూఢిల్లీ:
దాదాపుగా ఏడాది నుంచి కాలుష్యంతో ఉక్కిరిబిక్కరవుతున్న ఢిల్లీవాసులు ఎట్టకేలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలిగారు. ఢిల్లీని తాకిన రుతుపవనాలు నగరంపై కమ్ముకున్న దుమ్ముధూళిని కడిగేయడంతో గాలి నాణ్యత ఏడాది తర్వాత మొదటిసారి సంతృప్తికర స్థాయికి చేరింది. ఈ వారం మొదట్లో దేశ రాజధానిని తాకిన రుతుపవనాలతో గురువారం కురిసిన భారీ వర్షం.. భరించలేని ఎండ, ఉక్కపోతతో ఉడికిపోతున్న ఢిల్లీవాసులకు ఉపశమనాన్ని ఇచ్చింది. భారీగా పెరిగి ఈ నెలలో మునుపెన్నడూ లేని స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని కూడా ఈ తొలకరి వాన తగ్గించింది. శుక్రవారం ఢిల్లీలో గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో 83గా ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత మెరుగవనుందని తెలిపారు. జూన్ 13న పశ్చిమ భారతం నుంచి వచ్చిన ధూళి మేఘాల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. చివరిసారిగా ఢిల్లీవాసులు ఆగస్ట్ 2017లో శుభ్రమైన గాలిని పీల్చినట్టు సీపీసీబీ తెలిపింది.