ఆ నలుగురికి ఉరే సరి.

న్యూ ఢిల్లీ:
నిర్భయకు ఆరేళ్ల తర్వాత న్యాయం జరిగింది. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలకు ఉరిశిక్షే సరైనదని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. తమ మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని ముగ్గురు నిందితులు దాఖలు చేసుకొన్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ తోసి పుచ్చింది. ఈ దోషులకు మరణశిక్షే సరైనదంటూ సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.నిర్భయని అతిక్రూరంగా లైంగిక దాడి చేసి చంపిన నిందితులకి ట్రయల్‌ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిని సవాలు చేస్తూ వారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. అక్కడా వారికి చుక్కెదురైంది. దీంతో నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు 2017 మే 5న ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను సమర్థిస్తూ నలుగురికి ఉరిశిక్ష వేయాల్సిందేనని తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై అక్షయ్‌ ఠాకూర్‌ మినహా మిగిలిన ముగ్గురు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్‌ వేశారు. గత నవంబర్‌లో సుప్రీం కోర్టు ఈ పిటీషన్‌ను స్వీకరించింది. ఇప్పుడు వీరి పిటీషన్‌ను విచారించిన కోర్టు వారికి ఉరిశిక్ష వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌లో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ భానుమతి ఉన్నారు. ముకేష్ సింగ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తాలు మాత్రమే సుప్రీంలో పిటిషన్‌ వేసినప్పటికీ ఇవాళ సుప్రీం వెలువరించిన తీర్పు నలుగురు నిందితులకూ వర్తిస్తుంది. 2012 డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో ఓ వైద్య విద్యార్థినిపై మైనర్ సహా ఆరుగురు పాశవికంగా అత్యాచారం జరిపి, తీవ్రంగా గాయపరిచారు. ఆమె 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, డిసెంబర్ 29న కన్నుమూసింది. యావద్దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై ప్రజల నిరసనతో దిగివచ్చిన ప్రభుత్వం ‘నిర్భయ’ పేరిట కఠిన చట్టాలు తీసుకొచ్చింది. బస్ డ్రైవర్ రామ్ సింగ్, అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ లతో పాటు మైనర్ బాలుడు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. 2013, సెప్టెంబర్ 13న సెషన్స్ కోర్ట్ వీరికి ఉరే తగిన శిక్షని తీర్పిచ్చింది. శిక్షాకాలం పూర్తయిన మైనర్ ని విడుదల కాగా రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.