ఆ 48 గంటలు ‘ఎఫ్. బీ’లోనూ నిశ్శబ్దమే.

న్యూఢిల్లీ:
ఎన్నికల సంఘం నిబంధనలను పాటించేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అంగీకరించింది. ఎన్నికలకు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయరాదన్న ఎలక్షన్ కమిషన్ నిబంధనను అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ 48 గంటల్లో ఫేస్ బుక్ ద్వారా చేసే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలగించేందుకు సిద్ధమని ఎఫ్ బీ 14 మంది సభ్యుల ఈసీ కమిటీకి తెలిపింది. చివరి 48 గంటల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి వాణిజ్య ప్రకటన స్వీకరించవద్దని ఈసీ ఎఫ్ బీని కోరింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 ఓటింగ్ కు రెండు రోజుల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తోంది. దీనిలో మార్పులు చేయడానికి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో జనవరి 8న ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నిశ్శబ్ద కాలంలో సోషల్ మీడియా, ఇతర మీడియాల ద్వారా జరిగే ప్రచార ప్రభావాన్ని పరిశీలించి కోడ్ ఆఫ్ కాండక్ట్ లో చేయాల్సిన మార్పులను సూచించే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పజెప్పారు. కొత్త మాధ్యమాలు, సోషల్ మీడియా రాకతో ఎన్నికల ప్రచార నిషేధం అమలు చేయడం ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. ఫేస్ బుక్ చొరవతో ఎన్నికల చట్టం అమలుకు మొదటిసారి ఒక సోషల్ మీడియా వేదిక, ఈసీ కలిసి పనిచేస్తున్నట్టయింది.