ఇందిరా ఆవాస్ యోజన కనుమరుగు.

న్యూఢిల్లీ:
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిర, రాజీవ్ ల పేర్లపై పెట్టిన పథకాలను నామరూపాలు లేకుండా తుడిచేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)గా ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఐఏవైను ఇందిర శత జయంతి సంవత్సరంలోనే మూసివేసేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. ఐఏవైని మూసివేస్తున్నందున ఎన్ని ఇళ్లు నిర్మించారో తెలియజేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

1985 నుంచి ఐఏవై కింద లక్షలాది గృహాలు నిర్మించారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి మార్పులు చేసి ఏప్రిల్ 1, 2016 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పీఎంఏవై-జీ)ను ప్రారంభించింది. అయితే సుమారు 30 లక్షల గృహాల నిర్మాణం పెండింగ్ లో ఉండటంతో ఐఏవైను మూసేయలేదు. పీఎంఏవై-జీ పథకానికి కేటాయించిన నిధులతో ఆయా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు.

మార్చి 31, 2018 నాటికి ఐఏవై కింద ఎన్ని గృహాలు నిర్మించారో తెలియజేయాలని జూన్ 15 న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కేంద్రం కోరింది. ఐఏవై ఖాతాలు సరిచూసి మూసేయనున్నట్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2014లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికను ఐఏవై మూసివేతకు సాకుగా చూపిస్తోంది. కాగ్ తన నివేదికలో నిర్మించాల్సిన ఇళ్ల సంఖ్య, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కొరవడటం, నాసిరకం నిర్మాణాలు, పర్యవేక్షణ లోపాలు వంటి వాటిని తూర్పార బట్టింది.