ఇరిగేషన్ ప్రాజెక్టులలో 5,780 కోట్ల కుంభకోణం. మనీ లాండరింగుపై ఈ.డీ.కి ఫిర్యాదు.

  • అవినీతిపై హైకోర్టులో కేసు.
    ‘గాలి’ లాగే కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదన్న నాగం.

మహబూబ్ నగర్;
గాలి జనార్దన్ రెడ్డిని జైలుకి పంపినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా జైలుకు పంపుతానని కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ 500 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు నాగం సోమవారం మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ అవినీతి బండారాన్నీ బయటపెడతానని అన్నారు. కేసీఆర్ అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా నాగం ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 1 నుంచి 28 ప్యాకేజి వరకు పనులు చేసిందన్నారు . కాంగ్రెస్ చేసిన వాటిని కూడా తానే చేశానని చెప్పుకునే దౌర్భాగ్యంలో కేసీఆర్ ఉన్నారంటూ మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయ్యాయని, 10 శాతం పనులు కూడా నాలుగేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు కింద పొరుగు జిల్లాల రైతులకు ఎకరానికి రూ. 12 లక్షలు పరిహారం ఇస్తున్నారని, మహబూబ్ నగర్ లో మాత్రం రైతులకు మాత్రం రూ. 3 లక్షలే ఎందుకు ఇస్తున్నారని నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో రూ. 5,780 కోట్ల అవినీతి జరిగిందన్నది ఆయన ఆరోపణ. దీనిపై కోర్టులో కేసు వేయనున్నట్టు నాగం తెలిపారు.