ఈ నెల 27-28న సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం.

ఎస్.కె.జకీర్.
ఈ నెల 27 అర్థరాత్రి ఈ శతాబ్దంలోనే అరుదైన అంతరిక్ష అద్భుతం దర్శనమివ్వబోతోంది. ఆ రోజు రాత్రి 11.54 గంటలకు శతాబ్దంలోనే అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం పట్టనుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ చంద్ర గ్రహణం దాదాపుగా రెండు గంటల సేపు ఉంటుంది. ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర ప్రాంతం మినహా రష్యా అంతటా, ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా తూర్పు ప్రాంతం, అంటార్కిటికాలలో ఈ సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం వీక్షించవచ్చు.
జూలై 27 రాత్రి 11.54 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి దాటాక అంటే జూలై 28న ఒంటి గంటకు చంద్రుడు పూర్తిగా అదృశ్యమవుతాడు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 2.43 వరకు కొనసాగుతుంది. అత్యంత సుదీర్ఘ కాలం అంటే సుమారుగా 1.43 గంటల పాటు చంద్రుడు కనిపించడు. తెల్లవారుజామున 3.49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు, పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది. భారత్‌లోని అన్ని ప్రాంతాలవారు గ్రహణాన్ని పూర్తిగా చూడవచ్చు.ఈ నెల 27న భూమికి సరిగ్గా ఎదురు దిశలో అంగారక గ్రహం భ్రమణం జరగనుంది. సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో చంద్రునికి సమీపంలో మెరుస్తున్న అంగారకుడిని చూడవచ్చు. నాలుగు రోజుల తర్వాత జూలై 31న అంగారక గ్రహం భూమికి చేరువలో 57.6 మిలియన్ కిలోమీటర్ల నుంచి 55.7 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి అంటే దగ్గరగా వస్తుంది. 60వేల ఏళ్లలో అంగారక గ్రహం భూమికి ఇంత చేరువలోకి రావడం ఇదే తొలిసారి. గతంలో క్రీ.పూ.57613లో భూమికి సమీపంలోకి అంగారక గ్రహం వచ్చింది. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో బృహస్పతి కంటే రెండు రెట్లు ప్రకాశవంతంగా కనిపించే అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చును. 2020 అక్టోబర్ 6న మళ్లీ భూమికి సరిగ్గా ఎదురుగా ఇప్పుడున్న దాని కంటే పెద్దదిగా అంగారక గ్రహం రానుంది. కాని అప్పుడు అంగారక గ్రహం 61.76 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్లీ 2035, 2087లో ఈ విధంగా భూమికి ఎదురు దిశలో అంగారక గ్రహం వస్తుంది.