ఈ వారంలో భారీ వర్షసూచన.

న్యూ ఢిల్లీ:
ఈ వారం దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు జమ్మూకశ్మీర్, తమిళనాడు, అస్సాం, గుజరాత్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సారి 17 రోజులు ముందుగా రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వానలు పడతాయని చెప్పింది. ఇవాళ హిమాలయాలను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, అస్సాం, మేఘాలయలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంచనా వేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చు. ఉత్తర హర్యానా, చండీగఢ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, ఒడిషా, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కొంకణ్, గోవా, రాయలసీమ, తమిళనాడు, లక్షద్వీప్, కోస్తా కర్ణాటకలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అస్సాం, మేఘాలయ, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాలయ ప్రాంత పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గోవా, రాయలసీమ, కర్ణాటక తీరప్రాంతంతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే సూచనలు ఉన్నాయి.గురువారం కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, అస్సాం, మేఘాలయ, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, కేరళలకు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉన్నట్టు తెలిపింది. శుక్రవారం నాడు ఒడిషా, కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటకలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. విదర్భ, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లోని గంగా మైదానం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలలో భారీ వర్షపాత సూచనలు ఉన్నాయి.