ఎన్నికలకు కాంగ్రెస్ సమర సన్నాహాలు. 15 రోజుల్లో బూత్ కమిటీలు. రహస్య సర్వేలు. గెలుపుగుర్రాల అన్వేషణ.

హైదరాబాద్;
వచ్చే ఎన్నికల్లో సమరానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ నెల 15 కల్లా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎఐసిసి ఆదేశించింది. అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని, నియోజక వర్గాల్లో నాయకులంతా ముందస్తుకు సిద్ధంగా ఉండాలని నాయకులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకత్వం సూచిస్తున్నది. రహస్య సర్వే చేయించి వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని ఏఐసిసి చెబుతున్నది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఓడిన వారికి టికెట్లు ఇవ్వొద్దని సూచించింది. నాయకుల మధ్య ఎక్కడైనా గొడవలుంటే వెంటనే పరిష్కరించాలని, వారి మధ్య సమన్వయం సాధించాలని ఎఐసిసి ఆదేశించింది. క్షేత్రస్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయడానికి, ఎన్నికలనాటికి నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకోవడానికి తెలంగాణకు ముగ్గురు కార్యదర్శులను ఏఐసీసీ నియమించింది. ఎన్‌. ఎస్‌. బోసురాజుకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, జహీరాబాద్‌, మెదక్‌, చేవెళ్ల పార్లమెంటు స్థానాలు, సలీం అహ్మద్‌కు మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, శ్రీనివాసన్‌ కృష్ణన్‌కు ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాల బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభ్యర్థులు, ఆశావహులతో పార్లమెంటు నియోజక వర్గాలవారీగా ఏఐసీసీ కార్యదర్శులు సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ప్రజల్లో ఆ విషయాన్ని బలంగా తీసుకు వెళ్లలేకపోవడం, కొన్ని తప్పుల వల్ల పార్టీ ఓడిపోవల్సి వచ్చిందని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఆశావహులు ఉన్నారు. అటువంటి నియోజకవర్గాలలో వీలైనంత త్వరగా ఒకరికి ‘కన్ఫర్మ్’ చేస్తే ఎన్నికల నాటికి ప్రత్యర్థులను సులువుగా చిత్తు చేయవచ్చునని భావిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఎన్నికలు రావచ్చునని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయపడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందువల్ల ఇప్పటి నుంచే బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేయాలని, పనితీరునూ మెరుగు పరుచుకోవాలని పార్టీ నాయకత్వం టిపిసిసి ని కోరుతున్నది.