ఎన్నికలకు సిద్ధం.-ఎంపి కవిత.

జగిత్యాల:
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు జరిగినా, విడివిడిగా ఎన్నికలు జరిగినా బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారన్నారు.బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల లో కోరుట్ల, మల్లాపూర్ మండలాల టిఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కవిత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడుస్తానని పార్టీని పటిష్టం చేస్తామని సభ్యుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరులకు నివాళి గా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం కోసం కేసిఆర్ ఎన్నో అవమానాలు, తిట్లను భరించి లక్ష్యాన్ని సాధించారు అని చెప్పారు. పదిహేనేళ్ల స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు కేసీఆర్ వల్లనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు అధికారాన్ని అప్పగించారని తెలిపారు.
రేపటి తెలంగాణ బిడ్డల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆ పనులను కొనసాగించడానికి పార్టీ పటిష్టంగా ఉండాలని అప్పుడే మన బంగారు తెలంగాణ సాకారం అవుతుందని వివరించారు. కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని అన్నారు. ఈ సందర్భంగా కథ చెప్పారు. ద్రోణాచార్యుడు కౌరవులు పాండవుల పిల్లలకు విలువిద్య నేర్పిస్తున్నప్పుడు ఒక రోజు చెట్టుపై ఉన్న ఒక పెట్టను చూపి దాని కన్ను చూసి బాణం కొట్టాలని అన్నారట. దుర్యోధనుడు భీముడు చెట్టు చూశానని, పిట్టని చూశామని చెప్పారట. కాని అర్జునుడు మాత్రం పిట్ట కన్ను కనబడుతుంది అని చెప్పాడని అదే లక్ష్యానికి సంకేతమని వివరించారు. కేసీఆర్ లక్యాన్ని గురి చూసి కొట్టే గురువు అని చెప్పారు. కేసీఆర్ కు ఆ శక్తిని కార్యకర్తలు ఇచ్చారని కవిత అన్నారు.
దుర్మార్గులు కూడా వేల కొద్ది మంది పుట్టారని, వారు చేస్తున్న చెడ్డపనులను మంచివాళ్లు చూస్తూ కూర్చోవడం క్షమించరాని నేరం అన్నారు. నిజంగానే మంచివాళ్ళయితే బయటికి వచ్చి వాళ్ళని ఎదిరించాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని ఆన్నారు. ముచ్చట్లు కాదు కావాల్సింది పని.. కార్యకర్తలు ఆ పని చేయాలని కార్యసాధకుడు అయిన కేసిఆర్ కు వెన్నంటి ఉండాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు.నాలుగేళ్లలో నాలుగు వందల పైచిలుకు కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఒక్క వ్యవసాయం మృతి తీసుకుంటే 10 పథకాలను వ్యవసాయానికి అనుసంధానమై ఉండటాన్ని గమనించాలన్నారు.
అంగన్వాడీల్లో, మధ్యాహ్న భోజనం గతంలో కొలత పెట్టీ పెట్టేవారు.. ఇప్పుడా పరిస్థితి లేదు. సన్న బియ్యం అన్నాన్ని ఎంత కావాలంటే అంత పెడుతున్నారని వివరించారు. చేసిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదే ఆన్నారు.గొర్రె పల్లి గ్రామంలో 1436 మంది జనాభా ఉందని, 350 గడపలు ఉంటే 391 మందికి పెన్షన్ లు అందుతున్నాయని చెప్పారు. రూ.10 కోట్ల 60 లక్షల58 వేల రూపాయలు గొర్రె పల్లి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని కవిత తెలిపారు. కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో రూ.250 కోట్లు ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఖర్చు చేసిందని ఎంపి కవిత వివరించారు.
కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 ప్రకటన చేసి 23న వాపస్ తీసుకున్న విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులు అందరికి తెలుసు అన్నారు.
ప్రపంచంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నాయకుడు ఒక్క కెసిఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. పదవులు ముఖ్యం కాదని పార్టీ బాగుంటే పదవులు వాటంతట అవే వస్తాయి అన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని ఉద్భోదించారు.టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణ అన్నారు. పార్టీకి మేమందరం కార్యకర్తలమని ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నాయకుడు సైతం పార్టీ కి మొదటి కార్యకర్త అన్న విషయాన్ని మరువరాదన్నారు. ఇటీవల ఆర్మూర్ లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ హాజరు అయ్యారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం రూ 38 కోట్లను కేటాయించిందని, ఇప్పుడు కేసిఆర్ రెండు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని ప్రస్తావించి ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారనీ ఎంపి కవిత తెలిపారు.3 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ ల సామర్ధ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉండేదని ఇప్పుడు 19 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ ల సామర్ద్యం ఉందని మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి చెప్పారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ముందుచూపు పనులకు నిదర్శనమని ఎంపి కవిత వివరించారు.ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ వర్గాలకు రుణాలు ఇప్పించడం ద్వారా ఆర్థికంగా చేయూతనందించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు ఎప్పుడు విశ్రాంతి గా ఉండ కూడదని సూచించారు.
సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ బస్వరాజు సారయ్య, బెవరెజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాదరావు, మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కార్యకర్తల బాధ్యతలను వివరించారు. ఉద్యమ సమయంలో చూపిన తెగువ, కార్యాచరణ యిప్పుడు పార్టీ పటిష్టత కోసం రూపొందించుకోవాలని సూచించారు.సమావేశంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.