హైదరాబాద్:
ఓ వ్యక్తి ఏటీఎంలో ఉండగానే నిర్లక్ష్యంగా సెక్యూరిటీ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్లో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు బోడుప్పల్లో నివాసం ఉంటున్న కృష్ణ సోమవారం రాత్రి బోడుప్పల్ ప్రధాన రహదారిలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం లోపలికి వెళ్లాడు. దీనిని గమనించని సెక్యూరిటీ సిబ్బంది ఏటీఎం షెల్టర్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో కృష్ణ ఏటీఎం సెంటర్లో 40 నిమిషాల పాటు బిక్కుబిక్కుమంటూ వేదన చెందాడు. చివరకు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఏటీఎంలో ఇరుక్కుపోయానని, ఏటీఎం వద్దకు రావాలని సమాచారం అందించాడు. వారు హుటాహుటిన ఏటీఎం సెంటర్‌కు చేరుకుని షెల్టర్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో అక్కడే ఉన్న కొందరు ఇండియన్ బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేశారు. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఏటీఎం వద్ద ఉన్న టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసుకోండని ఫోన్ పెట్టేసినట్లు బాధితులు తెలిపారు.ఇంతలో ఏటీఎం వద్ద దారిన వెళ్లే వారు గుమ్మిగూడారు. అదే బిల్డింగ్‌లో ఉన్న బ్యాంకు వాచ్‌మన్, ఏటీఎం వద్ద జనాలను చూసి అక్కడకు చేరుకున్నాడు. అందులో మనిషి ఉన్న విషయాన్ని గమనించి వెంటనే షెల్టర్ తాళాలు తీయడంతో కృష్ణ ఊపిరి పీల్చుకున్నాడు. వ్యక్తి ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు మేనేజర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.