ఏడాదికి రెండుసార్లు నీట్, జేఈఈ.

న్యూఢిల్లీ;
కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకొంది. జాతీయ స్థాయిలో ప్రధాన పరీక్షలైన నీట్, జేఈఈ, సీమ్యాట్ పరీక్షలను ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నారు. ఇకపై ఈ పరీక్షలను సీబీఎస్ఈకి బదులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.

ఏటా ఫిబ్రవరి, మే నెలల్లో నీట్.. జనవరి, ఏప్రిల్ నెలల్లో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై నీట్‌, జేఈఈ, జీమాట్‌ తరహా పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల సిలబస్‌ మార్పు లేదని, పరీక్షా విధానంలోనే మార్పు చేస్తున్నట్టు చెప్పారు. అడ్మిషన్ సమయంలో రెండు సార్లు రాసిన పరీక్షల్లో బెస్ట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటారు.

విద్యార్థులు కంప్యూటర్ సెంటర్లలో పరీక్ష కోసం ప్రాక్టీసు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ గుర్తింపు పొందిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను తెలియజేస్తారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మొదటి ప్రయత్నంలో సీటు సాధించలేకపోయిన వారు అదే ఏడాది రెండో ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉండటంతో పాటు విద్యాసంవత్సరం వృథా కాదు.