ఏపీ.బీజేపీ సారధిపై చెప్పుతో దాడి.

నెల్లూరు:
కావలిలో తనపై చెప్పుతో దాడి చేయడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ‘నాపై జరిగిన చెప్పుల దాడిని ఖండిస్తున్నా. చంద్రబాబు రాక్షస పాలనకు ఈ సంఘటనే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది’ అని విమర్శించారు. కాగా, కన్నాపై జరిగిన దాడిపై బీజేపీ యువ మోర్చా నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అన్నింటా విఫలమైందని, అందుకే, ఆ పార్టీ వాళ్లు తమపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి చెప్పు విసిరిన విషయం తెలిసిందే. అతన్ని బీజేపీ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడి విషయమై పోలీసులు నిందితుడిని విచారించారు. నిందితుడు ఉమామహేశ్వరరావు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. సమాజంపై విరక్తి చెందానని, అలాగే, ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వకుండా చేస్తున్న అన్యాయం చూసి భరించలేకపోయానని.. అందుకే, కన్నాపై చెప్పు విసిరానని నిందితుడు తమకు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఏపీ నేత సోము వీర్రాజు తాము సీఎం చంద్రబాబు కుటిల నీతిని అడ్డుకుంటామని అన్నారు. బీజేపీని చూసి టీడీపీ భయపడుతోందని అన్నారు. తాము ఎవ్వరికీ భయపడబోమని, తాము చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనను కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తీరు బాగోలేదని, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నారని సోము వీర్రాజు అన్నారు. టీడీపీ నేతలు కొరివితో తల గోక్కుంటున్నారని అన్నారు. రౌడీలతో దాడులు చేయిస్తున్నారని అన్నారు.